జగన్ కు ఓటమి భయం.. పులివెందులకు రాం..రాం!?
posted on May 27, 2023 10:02AM
వైనాట్ 175 నుంచి సొంత నియోజకవర్గం పులివెందులలోనే గెలుపు భయం వరకూ జగన్ తిరోగమన ప్రస్థానం వేగంగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా ప్రతిపక్ష పార్టీల ఖాతాలో పడకూడదన్నట్లుగా ఉన్న వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ధీమా మాయమైంది. సొంత నియోజకవర్గం.. పులివెందుల్లో నే ఆయన ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అదే స్థానం నుంచి బరిలోకి దిగితే ఓటమిని ప్రమాదం ఉందన్న భయంతో ఉమ్మడి కడప జిల్లాలోని మరో నియోజకవర్గం నుంచి పోటీ లోకి దిగాలని జగన్ యోచిస్తున్నట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.
అందులో భాగంగా జమ్మలమడుగు, కమలాపురం, కడప అసెంబ్లీ స్థానాలపై ఆయన ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ఆ క్రమంలో ఈ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఐ ప్యాక్ బృందాన్ని జగన్ కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ సర్వే కోసం ఇప్పటికే ఐ ప్యాక్ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం.
వైయస్ ఫ్యామిలీకి పులివెందుల కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి నియోజకవర్గంలో వివేకా దారుణ హత్యకు గురికావడం.. అనంతరం చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంతో పాటు.. సదరు నియోజకవర్గం కడప ఎంపీ అవినాష్ రెడ్డి కుటుంబం గుప్పిట్లోకి వెళ్లిపోయిందని.. ఆ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా తారుమారు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. దాంతో జగన్ నియోజకవర్గం మార్చాలనే నిర్ణయానికి వచ్చారనీ వైసీపీలోనే ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.
వివేకా హత్య కేసులో ఇప్పటికే వైయస్ భాస్కరరెడ్డి అరెస్ట్ అయ్యారు. నేడో రేపో వైయస్ అవినాష్ రెడ్డి సైతం కటకటాల పాలయ్యే అవకాశాలున్నాయి. ఆ క్రమంలో సొంత వారి నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైతే పరిస్థితి ఏమిటనే భావనతోనే పార్టీ అధినేత పులివెందుల నుంచి కాకుండా పక్కనే ఉన్న మూడు నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
అలాగే వివేకా హత్య కేసులో.. వైయస్ ఫ్యామిలీ హస్తం ఉందనే విధమైన బలమైన ముద్ర ఇప్పటికే నియోజవకర్గ ప్రజలలోకి చాలా బలంగా వెళ్లిపోవడం, దీంతో ఆ ఫ్యామిలీలో చీలికలు రావడం... అలాగే ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చినట్లు కొట్టొచ్చినట్లు కనిపించడంతో జగన్ పులివెందుల నుంచి పోటీ చేస్తే గెలుపు అనుమానం అన్న భావన బలంగా వ్యక్తం అవుతోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగన్ సొంత ఇలాకా.. పులివెందుల్లో సైతం టీడీపీ తన సత్తా చాటడంతో... స్థానికుడు భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో గెలుపొందారని చెబుతున్నారు. అలాగే పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బిటెక్ రవి సైతం పార్టీ బలోపేతం కోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడుతోన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ తన నియోజకవర్గాన్ని మార్చుకునేందుకు పక్కా ప్రణాళికలు సిద్దం చేసుకొన్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.