మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పెంపు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో ఉన్న ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేసిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. కాగా కొత్త దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు అందుతున్నాయి.  

ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ, అలాగే ఆఫ్‌లైన్‌లోనూ లైసెన్సుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.   దరఖాస్తు దారుల నుంచి రెండు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ డిపాజిట్  చేయాల్సి ఉంటుంది.  మొత్తం  3396 మద్యం దుకాణాలకు గాను మంగళవారం (అక్టోబర్ 8) వరకు 41,348 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా ఇప్పటి వరకు రూ. 826.96 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.

 ఇలా ఉండగా మద్యం టెండర్ల షెడ్యూల్‌ను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.  ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 14వ తేదీన మద్యం షాపులకు లాటరీ తీయనుంది. 16వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. అయితే, గడువు పొడగించిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు.