అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్.. సారె సమర్పించనున్న సీఎం చంద్రబాబు

బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై  దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరానవరాత్రులలో భాగంగా ఏడవ రోజు బుధవారం (అక్టోబర్ 9) కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు.  

ముఖ్యంగా మూల నక్షత్రం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ఇలా ఉండగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ మధ్యాహ్నం అమవారికి సారె సమర్పిస్తారు.  సీఎం, డెప్యూటీ సీఎంల రాక సందర్భంగా దుర్గమ్మ కొండపై భద్రతా ఏర్పాట్లును కట్టుదిట్టం చేశారు.

 ఇలా ఉండగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అమ్మవారిని దర్శించుకుంటున్న నేపథ్యంలో సామాన్య భక్తుల దర్శనాలను ఆపబోమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సామాన్య భక్తుల దర్శనాలు యథావిధిగా సాగుతాయన్నారు. అయితే వీఐపీ దర్శనాలను మాత్రం సాయంత్రం నాలుగు తరువాతనే అనుమతిస్తామని తెలిపారు.