ఎవరికి భయపడను.. డీఎస్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ రోజు డీఎస్ తెరాస పార్టీలోకి చేరారు. గత వారం క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన డీఎస్ ఈరోజు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ డీఎస్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలా పార్టీలోకి చేరారో లేదో అప్పుడే కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ వాదులందరిని ఏకతాటిపై నడిపి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం నిరాహార దీక్ష చేశారు అని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పాలని.. తెలంగాణ ప్రజలు సోనియా రుణం తీర్చుకోలేరని అన్నారు. తాను పార్టీ వీడుతున్నందుకు చాలా మంది విమర్శిస్తున్నారు.. "అలాంటివి తానేమి పట్టించుకోనని.. ఎవరికి భయపడేది లేదని.. తానేదో పదవులు ఆశించి టీఆర్ఎస్ లోకి రాలేదని.. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో తాను కూడా పాటుపడటానికే" అని చెప్పారు. డీఎస్‌తో పాటు ఏవీ సత్యనారాయణ, డి. సురేందర్, ఆర్. సత్యం, బోయినపల్లి కృష్ణమూర్తి, సతీశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరారు.