తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా 

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో కేసులు రెట్టింపు అయ్యాయి. మార్చిలో ఇంకా పెరుగుతున్నాయి. జనవరిలో కేవలం 4,079 కేసులు నమోదైతే.. ఫిబ్రవరిలో 8,029 వచ్చాయి. కొద్ది రోజులుగా కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతోందని క్షేత్రస్థాయిలో టెస్టులు చేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్లు చెబుతున్నారు. ఫిబ్రవరి చివరి నుంచి క్రమంగా సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని, 

పాఠశాలలు, కాలేజీలు తెరవడం , ప్రైవేటు సంస్థల్లో తెలియకుండానే ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరిస్తుందనే అనుమానాలు వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతుండడం రాష్ట్రంలోనూ ప్రభావం చూపుతోంది.కేసులు పెరుగుతున్న విషయాన్ని వైద్య శాఖ కూడా అంగీకరిస్తోంది. విద్యా సంస్థలు తిరిగి ప్రారంభించినప్పటి నుంచి కేసుల సంఖ్య పెరుగుతోందని చెబుతోంది.ప్రైవేటు సంస్థల్లో ఒకరికో ఇద్దరికో వచ్చి, వారి ద్వారా తెలియకుండానే విస్తరిస్తోందని, తద్వారా.. ఎక్కువ మంది కరోనా బారినపడుతున్నారని వివరించాయి.

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లోనే కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్‌లో జిల్లాలో ఇటీవల ఒకరి అంత్యక్రియల్లో పాల్గొన్న 33 మందికి పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న 21 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురు 10వ తరగతి విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వసతి గృహంలోని మిగతా విద్యార్థులను అధికారులు ఇళ్లకు పంపించారు. అయితే రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య మాత్రం 200లోపే ఉంటోంది. వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని బ్రేక్‌ చేయాలంటే కచ్చితంగా పెద్దఎత్తున పరీక్షలు చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం ఉదయం పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. వెంటనే ఆమె ఐసొలేషన్‌కు వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చేరారు. తనను కలిసిన వారంతా కొవిడ్‌ టెస్టులు చేయించుకోవాలని మంత్రి ఒక ప్రకటనలో కోరారు.