న్యాయ వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లుతోందా?
posted on Jun 24, 2015 11:46AM
జయలలిత కేసులో కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు, సల్మాన్ ఖాన్ కేసులో బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పులపై దేశవ్యాప్తంగా విమర్శలు వినిపించాయి. బహుశః ఆ కారణంగానే కర్నాటక ప్రభుత్వం మళ్ళీ కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో నిన్న ఒక పిటిషను దాఖలు చేసినట్లు భావించవచ్చును. తన కేసుపై స్వంత రాష్ట్రమయిన తమిళనాడులో విచారణ జరిగినట్లయితే తనకు న్యాయం జరగదని భావిస్తున్నందున పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయమని ఆమె అభ్యర్ధన మేరకే ఆమె కేసును కర్నాటకకు బదిలీ చేసారు. ఆమె చేసిన అభ్యర్ధన న్యాయవ్యవస్థను అనుమానిస్తున్నట్లుగానే ఉన్నప్పటికీ, తమిళనాడులో అప్పటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ఆమె కేసును కర్నాటకకు బదిలీ చేసింది.
నిర్భయ కేసులో దోషులు ఎవరో అందరికీ తెలిసినా నేటి వరకు ఎవరికీ శిక్షలు పడలేదు. ఆ కారణంగానే దేశంలో ఇప్పుడు మహిళలపై సామూహిక అత్యాచారాలు చాలా సర్వసాధారణమయిపోయాయి. అయినప్పటికీ న్యాయవ్యవస్థల మీద నేటికీ ప్రజలకు నమ్మకం నిలిచే ఉండటం చాలా సంతొషించవలసిన విషయమే.
ప్రజలకు నమ్మకం ఉన్నప్పటికీ రాజకీయ నాయకులకు లేదని నిరూపిస్తున్నట్లుగా ఓటుకి నోటు వ్యవహారంలో ప్రధాన పాత్రధారిగా ఉన్న నామినేటడ్ ఎంయల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ నిన్న హైకోర్టులో ఒక పిటిషను వేసారు. ‘కొన్ని రోజుల క్రితం స్టీఫెన్ సన్ మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడా తన పేరు ప్రస్తావించలేదు కనుక ఈ కేసు నుండి తనకు విముక్తి కల్పించాలని కోరుతూ ఈ కేసులో నాల్గవ నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య వేసిన పిటిషనును స్వీకరించి, తనకు నోటీసులు ఇచ్చిన జస్టిస్ బి. శివశంకర్ రావుపై తనకు నమ్మకం లేదని కనుక ఈ కేసును వేరే న్యాయమూర్తికి బదిలీ చేయాలని కోరుతూ ఎల్విస్ స్టీఫెన్ సన్ నిన్న హైకోర్టులో ఒక పిటిషను వేసారు.
ఇంతకు ముందు తెలంగాణా ఎసిబిపై కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చేయి. తెలంగాణా ప్రభుత్వ కనుసన్నలలో ఎసిబి పనిచేస్తోందని కనుక అది నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నట్లు భావించడం లేదని కనుక ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో కృష్ణయ్య అనే ఒక న్యాయవాది పిటిషను దాఖలు చేసారు. అదేవిధంగా ఆంద్రప్రదేశ్ సిఐడి అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేయడాన్ని తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇదివరకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ అధినేత రంజిత్ సిన్హా నిత్యం కేంద్రమంత్రులను కలుస్తూ వారి ఆదేశాలనుసారం బొగ్గు గనుల కుంభకోణంపై తన సంస్థ తయారుచేసిన నివేదికలో మార్పులు చేర్పులు చేసినట్లు స్పష్టం అవడంతో సుప్రీంకోర్టు ఆయనను తీవ్రంగా మందలించడమే కాక ఆయనపై కూడా కేసు నమోదు చేయమని కేంద్రాన్ని ఆదేశించింది. ఈవిధంగా దేశంలో న్యాయవ్యవస్థలు, దర్యాప్తు వ్యవస్థలు ప్రజల నమ్మకం పోగొట్టుకొన్నట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలనే దెబ్బతీసే ప్రమాదం ఉంది.