తెలుగు రాష్ట్రాలను ఇక గవర్నరే రక్షించాలి

 

ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య చెలరేగిన చిచ్చు ఇప్పుడు సెక్షన్: 8తో ప్రజల మధ్యకు కూడా పాకుతోంది. ఆంద్రప్రదేశ్ మంత్రులు, నేతలు, ప్రజలు కూడా దానిని తక్షణమే అమలుచేయాలని గట్టిగా కోరుతుంటే, తెలంగాణా మంత్రులు, నేతలు, ప్రజలు దానిని అంతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఎవరి వాదనలు వారు బలంగా వినిపిస్తున్నారు. రెండు రాష్ట్రాల గొడవలలో కేంద్ర ప్రభుత్వం తలదూర్చబోదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీకి తెదేపా మిత్రపక్షంగా, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా కొనసాగుతున్నందున ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వెనకేసుకు వస్తే కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంభిస్తోందని తెలంగాణా ప్రజలు భావించే అవకాశం ఉంది కనుకనే బహుశః ఆయన ఆవిధంగా అని ఉండవచ్చును. కానీ ఆ కారణంగా ఈ వ్యవహారంలో తలదూర్చబోమని కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ బిగుసుకొని కూర్చోన్నట్లయితే ఈ సమస్యలు ఇంకా జటిలమయ్యే ప్రమాదం ఉంది.

 

ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ కి తెలియవని కాదు. బహుశః వారి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉండిఉండవచ్చును. ఆ ప్రయత్నంలోనే సెక్షన్: 8ని ముందుకు తెచ్చి ఉండవచ్చును. విభజన చట్టంలో ఉన్న ఈ సెక్షన్ని ఉపయోగించుకొని రెండు ప్రభుత్వాల మధ్య నడుస్తున్న ఈ యుద్దానికి తెర దించాలని కేంద్ర ప్రభుత్వం భావించినందునే ఆ ఆలోచన చేసి ఉండవచ్చును. కానీ అది రెండు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే అది మరొక కొత్త సమస్యకు దారి తీయడం చాలా ఆందోళన కలిగిస్తోంది.

 

సెక్షన్: 8కి అనుకూలంగా, వ్యతిరేకంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు వాదోపవాదాలు మొదలుపెట్టడంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారుతోంది. అయితే సెక్షన్: 8 ద్వారా రెండు ప్రభుత్వాల మధ్య నడుస్తున్న వివాదాలకు ముగింపు పలకడానికే తప్ప తెలంగాణా ప్రభుత్వ హక్కులను భంగం కలిగించేందుకు కాదని తెరాస, తెదేపా ప్రభుత్వాలకి తెలియదనుకోలేము. అయినా ఇరు రాష్ట్రాల మంత్రులు దీనిపై ఎందుకు తీవ్ర వాదోపవాదాలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ ముఖ్యమంత్రులిరురువురూ తమ మధ్య తలెత్తిన ఈ వివాదాలకు ఇంతటితో తెర దించేందుకు సిద్దపడినట్లయితే, ఇక సెక్షన్: 8 ప్రస్తక్తి కూడా ఉండకపోవచ్చును. కనుక గవర్నరే మళ్ళీ చొరవదీసుకొని ఈ సమస్యని పరిష్కరించవలసి ఉంటుంది.