ప్రాణాలు తీసిన బెట్టింగ్...

 

కొడుకు మంచి స్థాయికి ఎదిగి తమని మంచిగా చూసుకుంటాడని ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారు. అలా ఆశపడటం ఆ తల్లిదండ్రుల పాలిట శాపమయింది. క్రికెట్ బెట్టింగ్ జోలికి పోవద్దు, నాశనం కావద్దని కొడుకును హెచ్చరించడమే ఆ తల్లిదండ్రులు చేసిన తప్పయింది. గుంటూరుజిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో చెన్నుపాటి హరిబాబు, నాగేంద్ర దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి కుమారుడు శ్రీహరి బాధ్యత లేకుండా తిరగడం, క్రికెట్ బెట్టింగ్ లంటూ డబ్బులు మొత్తం వృధాగా పాడుచేయడం వారికి నచ్చలేదు. దీంతో కొడుకును మందలించారు. ఆ మంచి మాటలు నచ్చని కుమారుడు వారిపై చేయి చేసుకున్నాడు. కన్న కొడుకే తమపై చేయి చేసుకున్నాడని తీవ్ర మనస్థాపానికి చెందిన హరిబాబు, నాగేంద్ర గురువారం ఉదయం పొలానికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుకు బాధ్యత లేకుండా తిరగడం, మరోవైపు ఆర్థిక సమస్యలు కూడా ఆత్మహత్య కారణమని గ్రామస్తులు అంటున్నారు.