15లోగా గచ్చిబౌలి కరోనా ఆసుపత్రి సిద్ధం!
posted on Apr 7, 2020 4:07PM
తెలంగాణాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 15లోగా ప్రత్యేక కరోనా ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నారు. కరోనా బాధితుల కోసం గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఓ ఆసుపత్రిని ఏర్పాటు అవుతోంది. స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చేందుకు పనులు శరవేగంతో కొన సాగుతున్నాయి.
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆసుపత్రి పనులను పరిశీలించారు.
15 అంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో దాదాపు 1500 పడకలు అందుబాటులోకి రానున్నాయి. పనులు వేగవంతం చేసి ఈ నెల 15వ తేదీ వరకు పూర్తి చేయనున్నారు. రోజుకు దాదాపు వెయ్యి మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా కట్టడికి రాష్ట్రం ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది.