గడువు పెరగడంతో ‘సహకార’ పాలకమండలికి సువర్ణావకాశం!
posted on Nov 2, 2012 8:51AM
.png)
అనుకోకుండా సహకార సంఘాల పాలకమండలి సభ్యుల పదవీ కాలం పెరిగింది. అదీ 2013ఫిబ్రవరి 14వరకూ పరిమితి పొడిగించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సహకార సంఘం తరుపున పోటీ చేద్దామనుకున్న కొత్త నేతలు కంగుతిన్నారు. 2010 అక్టోబర్21తో పదవీకాలం ముగిసిన పాలకమండలికి సువర్ణావకాశం లభించింది. ఇంకా నల్లుకోవాల్సిన ఆమ్యామ్యా ఏమైనా మిగిలి ఉంటే పాలకమండలి దాన్ని తొందరగా సంపాదించుకోవచ్చు.
అయితే ఈసారి ఎన్నికలు ఖాయమని నమ్మిన కొత్తనేతలు ఇప్పటికే సభ్యులను మచ్చిక చేసుకుని ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. వారి ఆశలకు కొంత కాలం ప్రభుత్వమే బ్రేక్ వేసింది. ఈ బ్రేక్ వేయకుంటే సహకార సంఘం ఎన్నికల కోసం అధికారుల ఓటర్ల గుర్తింపు కూడా పూర్తి చేశారు. కొత్తజాబితాలతో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో ఇటువంటి పిడుగులాంటి వార్త రావటంతో ఇక ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని అధికారులు సైతం నీరసపడ్డారు.
ఓటర్ల జాబితాలు సవరించి బకాయిలు రికవరీ చేసి కొందరికి ఓటు హక్కు కల్పించిన తాము ప్రభుత్వ చర్యకు నివ్వెరపోతున్నామని జిల్లా సహకార అధికారి ఒకరు ‘తెలుగువన్’తో చెప్పారు. ఇప్పటికి నాలుగుసార్లు వాయిదా వేసిన ప్రభుత్వం 2013లోనైనా ఎన్నికలు నిర్వహిస్తే అంతే చాలని సహకార సంఘ సభ్యులు ఆశిస్తున్నారు.