ఆక్వా రుణాలమాఫీ వెనుకున్నది బాబుపై కోపమేనా?
posted on Nov 2, 2012 8:47AM
.png)
రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఇది సాధ్యం కాదన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆక్వాబకాయిలు రూ.468కోట్లు రద్దు చేశారు. అంతేకాకుండా రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 32లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు ఉచిత విద్యుత్తు అందిస్తామని కూడా సిఎం ప్రకటించారు. దేశం మొత్తం మీద రాష్ట్ర రైతులు 10శాతం మాత్రమే రుణాలు పొందుతున్నారని చెప్పారు. అన్నదాతల కోసం మరో రెండువేల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయనున్నామని హామీ ఇచ్చారు. వచ్చే రెండేళ్లలో రూ.16వేల కోట్లు ఖర్చు చేసి 30లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు.
ఇన్ని హామీలు వరుసగా సిఎం ఎందుకు ప్రకటించారు? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాము బ్యాంకురుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు మాట మరిచిపోయేందుకని కాంగ్రెస్ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి సిఎం ముందుగా అనుకున్నది ఈసారి విద్యారంగ పరంగా రాష్ట్రప్రజలను ఆకట్టుకోవాలనుకున్నారని తెలిసింది.
అయితే బాబు ప్రకటనతో తన ఆలోచన మార్చుకుని రైతులకు సంబంధించిన అంశాలపై తీవ్రస్థాయిలో స్పందించారు. అంటే ఒకరి(బాబు)పై కోపం వస్తేనే నేతలు(సిఎం) వాస్తవాలు(సంక్షేమం) అర్ధం చేసుకుంటారా? లేక పార్టీలో ఉన్న నేత(వట్టివసంతకుమార్ తదితరు)లు నష్టపోతున్నారని సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారా?