మా ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి...వైసీపీ వస్తే ఉద్యోగాలు పోతాయి : చంద్రబాబు
posted on Dec 16, 2025 8:57PM

మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్ లో నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోం మంత్రి అనిత నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు కానిస్టేబుల్ నోటిఫికేషన్‌పై వేసిన కేసులను అధిగమించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి. వేరేవాళ్లు వస్తే.. ఉద్యోగాలు పోతాయిని ఆయన అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కానిస్టేబుళ్ల పాత్ర కీలకమని చంద్రబాబు స్పష్టంచేశారు.
కొత్తగా నియమితులైన కానిస్టేబుళ్లు నిజాయితీతో మరియు నిబద్ధతతో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను మరియు త్యాగాలను గుర్తు చేసుకున్నారు శిక్షణ కాలంలో కానిస్టేబుళ్లకు స్టైఫండ్‌ను ₹4,500 నుంచి ₹12,500 వరకు పెంచినట్లు సీఎం తెలిపారు. 2022 లో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టినా, గత ప్రభుత్వ హయాంలో ఎదురైన అనిశ్చితి తర్వాత ఇప్పుడు ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందని కూటమి ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
నా హయాంలో 23 వేలకుపైగా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశాం. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు ఇచ్చాం. గత ప్రభుత్వం ఎన్నికల ముందు నోటిఫికేషన్లు ఇచ్చినా, మేం కానిస్టేబుల్ నియామకాలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాం. శాంతి భద్రతల విషయంలో నేను ఎప్పుడూ రాజీ పడను’’ అని సీఎం స్పష్టం చేశారు. ఒకప్పుడు రాయలసీమలో ముఠాలు, ముఠా రాజకీయాలు ఉండేవని, చంపుకోవడమే పరిపాటిగా ఉండేదని చంద్రబాబు గుర్తుచేశారు. ‘‘తీవ్రవాదాన్ని నేను ఎప్పుడూ ఉపేక్షించలేదు. తీవ్రవాదాన్ని అణిచివేసినందుకు నాపై క్లైమోర్ మైన్స్‌తో దాడులు కూడా జరిగాయి’’ అని తెలిపారు.‘
రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారు. పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కానిస్టేబుల్ బాబురావు తమ గ్రామానికి రోడ్డు లేదని సభలో తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. తిమ్మలబండ–వెలుగురాతిబండ మధ్య రహదారి నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేయగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విషయం తెలియజేశానని తెలిపారు. ‘‘ఆ రోడ్డు నిర్మాణానికి పవన్ కల్యాణ్ రూ.3.90 కోట్లు మంజూరు చేశారు’’ అని సీఎం వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మొత్తం 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశారు. ఈ నెల 22 నుంచి కొత్త కానిస్టేబుళ్లకు 9 నెలల శిక్షణ ప్రారంభం కానుంది.