టీడీపీ అభ్యర్థికి చుక్కెదురు..మద్దతివ్వని ప్రజకూటమి

 

ఇబ్రహీంపట్నంలో అనుకోని ట్విస్ట్... కూటమి అభ్యర్థికి కాకుండా వేరొకరికి మద్దతు ప్రకటించిన ప్రజాకూటమి. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. ఆ పార్టీ తరుపున సామ రంగారెడ్డి బరిలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తరుపున టికెట్ ఆశించి భంగపడ్డ మల్‌రెడ్డి రంగారెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బీఎస్పీ బీఫారంపై బరిలో దిగారు. ఇతర నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగిన కాంగ్రెస్‌ నేతలను సస్పెండ్‌ చేసిన ఆ పార్టీ మల్‌రెడ్డి విషయంలో మాత్రం సానుకూలంగా వ్యవహరించింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ సామ వర్గీయులు గాంధీభవన్‌ ఎదుట ధర్నా చేసినా ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

అనూహ్యంగా పోలింగ్‌కు కొన్ని గంటల ముందు మల్‌రెడ్డికే తమ మద్దతని కాంగ్రెస్‌ సారథ్యంలోని ప్రజా కూటమి ప్రకటించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అయితే, ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయడానికి సామ రంగారెడ్డి మొదటి నుంచి ఆసక్తి చూపలేదు. తనకు ఎల్బీ నగర్ సీటు కావాలంటూ పట్టుబట్టారు. పార్టీ అధినేత చంద్రబాబును కలిసి తన అభిప్రాయం వెల్లడించారు. ఆయన సూచన మేరకు ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయటానికి సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ మల్‌రెడ్డికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించటం గమనార్హం.