ఏపీ లిక్కర్ స్కాం.. విజయసాయికి సిట్ నోటీసులు
posted on Apr 15, 2025 5:02PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వేగం పెంచింది. ఓ వైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజా కసిరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతూనే, హైదరాబాద్ లోని ఆయన నివాసం కార్యాలయాలలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నది. మరో వైపు ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా మాజీ ఎంపీ, ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 18న విజయవాడలోని సీపీ కార్యాలయంలో హాజరు కవాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొంది.
ఇప్పటికే విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం కర్త, కర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని మీడియా ముఖంగా చెప్పిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో విజయసాయి గతంలో సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కసిరెడ్డి రాజశేఖరరెడ్డే ఈ కుంభకోణానికి కర్త, కర్మ క్రియ అని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది.