సొంత వైద్యం వంటబట్టదు అంటే ఇదేనా?

స్వరాష్ట్రంలో  పని చేయని పీకే వ్యూహాలు!

ప్రశాంత్ కిషోర్, పీకే.. పేరు చాలు. పరిచయం అవసరం లేదు.పీకే అంటే చాలు, ఆయన ఎవరో, ఆయన ఏమిటో అందరికీ అర్థమైపోతుంది.ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు అంత మంచి గుర్తింపు వుంది. అయితే అది ఆయన గతం. ప్రస్తుతం ఆయన, వేషం మార్చారు. రాజకీయ అరంగేట్రం చేశారు. సో.. ఇప్పడు పీకే పొలిటీషియన్, రాజకీయ నాయకుడు.  జన సురాజ్  పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపక అద్యక్షుడు. ఈ సంవత్సరం చివర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య భూమికను పోషించేందుకు తహతహ లాడుతున్న రాజకీయ నాయకుడు. ఈ ఎనికల్లో ఎలాగైనా కింగ్, కాదంటే కనీసం కింగ్ మేకర్ కావాలని కలలుకంటున్నారు.  

అవును గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలు, ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి  వరకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదలు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరకు ఎందరో నాయకులకు, ఎన్నో పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్  ఇప్పడు స్వయంగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. వ్యూహాత్మకంగా పావులు  కదుపుతున్నారు.అయితే  అదేదో సామెత చెప్పినట్లు  అందరికీ వర్కౌట్ ఆయన  వ్యూహలు, సొంతానికి వచ్చేసరికి అతంగా పనిచేస్తున్నట్లు లేదని అంటున్నారు.   ఔను పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు.. సొంత వైద్యం వంటబట్టదు అని పెద్దలు ఊరికే అన్నారా? ఇప్పడు తాను స్వయంగా రాజకీయవేత్తగా మారిన పీకేకు ఆయన వ్యూహాలు ఆయన సోంత పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడటం లేదు.. ఫలించడం లేదు.  

నిజానికి నాలుగేళ్ళ కిందట (2021)పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి పని చేసిన పీకే  ఇక పై  ఏ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించారు. అలాగే  క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేది లేదనీ అన్నారు. అంతే కాదు,  నేను రాజకీయాలకు పనికిరాను  అని తనకు తానే   సెల్ఫ్  సర్టిఫికేట్  ఇచ్చుకున్నారు. అయితే, ఆ తర్వాత కొద్ది కాలానికే  ఆ ఒట్టు తీసి గట్టున పెట్టారు. కాంగ్రెస్  పార్టీలో చేరేందుకు,  బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు  ప్రయత్నాలు సాగించారు. కాలికి బలపం కట్టుకుని దేశం అంతా తిరిగారు. శరద్ పవార్ మొదలు కేసీఆర్  వరకు ప్రముఖ నేతలు అందరినీ కలిశారు. అందరినీ కలిపారు. మరోవంక కాంగ్రెస్ పునర్జీవనానికి ఉడతా భక్తిగా   ఉచిత  సలహాలు కూడా ఇచ్చా రు. చివరకు  తాతకు దగ్గులు నేర్పినట్లు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సిడబ్ల్యుసి) సభ్యులను కూర్చోపెట్టి పాఠాలు చెప్పారు. ఇలా దేశ రాజకీయాల్లో  తన కంటూ ఒక స్థానం సంపాదిం చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. 

సరే ఆ ప్రయత్నాలు ఏవీ అంతగా పని చేయలేదు. మధ్యలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అప్పటి అధికార పార్టీలతో డీల్  కుదుర్చుకున్నారు. అయితే  అక్కడా కథ అడ్డం తిరిగింది. ఉభయ రాష్ట్రాల్లో ఆయన వ్యూహాలు ఉడక లేదు.ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ బండ్లు బోల్తా కొట్టాయి. అక్కడ ఏపీలో  జగన్ రెడ్డి, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఇద్దరి కిద్దరు చిత్తుగా ఓడి పోయారు. జగన్ రెడ్డి పరిస్థితి అయితే మరీ ఘోరం, పదకొండు పరుగులకే ఔటై పోయారు. ఇక చివరి ప్రయత్నంగా స్వరాష్ట్రం బీహార్ లో సొంత జెండా ఎగరేశారు. జన సురాజ్  పార్టీని స్థాపించారు. సంవత్సరం పైగా రాష్ట్రంలో పాద యాత్ర చేస్తున్నారు. అయితే  అదేమిటో కానీ, శకునం చెప్పే బల్లి  కుడితిలో పడింది అన్నట్లుగా.. యూపీ, బెంగాల్, ఢిల్లీ, ఏపీ ఇలా ఎక్కడెక్కడో, ఎవరెవరినో గెలిపించిన  ప్రశాంత్ కిషోర్ వ్యూహం  స్వరాష్టంలో,  పని చేస్తున్నట్లు లేదని అంటున్నారు. 

ఇటీవల బీహార్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జేఎస్పీ తొలిసారిగా ఎన్నికల బరిలో దిగింది.అయితే  నలుగు స్థానాలకు ఒంటరిగా పోటీ చేసిన జేఎస్పీకి  ఒక్క సీటు దక్కలేదు. కానీ  జేఎస్పీ ఖాతాలో పది శాతం ఓట్లు అయితే పడ్డాయి. అలా జేఎస్పీ చీల్చిన ఓట్లు ప్రతిపక్ష కూటమిని దెబ్బతీశాయి. మూడు సిట్టింగ్ స్థానాలతో పాటుగా మొత్తం నాలుగు స్థానాలలో ఆర్జేడీ సారధ్యంలోని మహా ఘటబంధన్ ఓడిపోయింది. రెండు నియోజక వర్గాల్లో అయితే  అధికార ఎన్డీఎ కూటమి అభ్యర్ధులకు వచ్చిన మెజారిటీ కంటే జేఎస్పీకి వచ్చిన ఓట్లు ఎక్కువని లెక్క తేలింది. దీంతో  పీకే అసలు రంగు బయట పడిందని బీహార్ ప్రజలు పీకే పార్టీని, బీజేపీ బీ  టీమ్ గా భావిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

ఈ నేపధ్యంలో ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో జేఎస్పీ ఓటు షేర్  ఏకంగా  పది నుంచి మూడు శాతానికి పడి పోయిది. దీంతో కింగ్ ఆర్ కింగ్ మేకర్ కావాలనే పీకే   కల కలగానే మిగిలి పోతుందని అంటున్నారు. అలాగే ఇటీవల పాట్నాలో జేఎస్పీనిర్వహించిన తొలి భారీ బహిరంగ సభకు లక్షల్లో జనం వస్తారని  భావించి ఏర్పాట్లు చేస్తే వేలల్లో కూడా జనం రాలేదు. అందుకే పీకే పట్టుమని పది నిముషాలు అయినా మాట్లాడకుండానే తట్టా బుట్టా సర్దేశారు. సో .. బీహార్ ఎన్నికల్లో పీకే పాత్ర ఏమిటన్నది ఇప్పడు ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు. అలాగే, ఉప ఎన్నికల్లో పోటీ చేయడం వ్యూహకర్త చేసిన వ్యూహాత్మక తప్పిదంగా భావిస్తున్నారు.