కేసీఆర్‌ రుజువు చేయాలి.. లేదా క్షమాపణ చెప్పాలి: జానారెడ్డి

 

హుస్నాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసారు.. అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి సవాల్ విసిరారు.. 'ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తే గులాబీ కండువా కప్పుకొని ప్రచారం చేస్తానని అసెంబ్లీలోనే అన్నారు.. జానారెడ్డికి నిజాయతీ ఉంటే ఈరోజు ఆ పనిచేయాలని నేను డిమాండ్‌ చేస్తున్నా' అని కేసీఆర్ అన్నారు.. అయితే తాజాగా జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కే సవాల్ విసిరారు.. కేసీఆర్‌ తనపై అసత్య అరోపణలు చేస్తున్నారని.. 24 గంటలు కరెంట్‌ ఇస్తే గులాబీ జెండా కప్పుకుంటానని అసెంబ్లీలో తాను అనని మాటలను అన్నట్లు చెబుతున్నారని  మండిపడ్డారు.. గులాబీ జెండా కప్పుకుంటానని తాను అన్నట్లు ఉంటే, ఆ రికార్డులు తెప్పించి ప్రజల ముందు పెట్టాలని డిమాండ్‌ చేశారు.. తాను అన్నట్లు రుజువు చేస్తే 24 గంటల్లోనే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు.. 24 గంటల్లోగా కేసీఆర్‌ రుజువు చేయాలి, లేకపోతే వెంటనే క్షమాపణ చెప్పాలని జానారెడ్డి డిమాండ్‌ చేశారు.