కాంగ్రెస్ ఇక కుటుంబ పార్టీ కాదు ..కానీ ..

కారణాలు ఏవైనా  రేపటి పరిణామాలు ఏలా ఉన్నా  ప్రస్తుతానికి అయితే, కాంగ్రెస్ పార్టీ కుటుంబ బంధనాల నుంచి కొంతవరకు బయట పడింది. ఒక అడుగు ముందుకేసింది. కుటుంబ పార్టీ ముద్రను తొలిగించుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. నిజానికి  ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈ మార్పుకు మూల కారణం రాహుల్ గాంధీయే.

ఎన్ని వైపుల నుంచి ఎన్నెన్ని వత్తిళ్ళు వచ్చినా, గాంధీ ఫ్యామిలీ బయటి వ్యక్తులే పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని 2019లో తీసుకున్ననిర్ణయం నుంచి రాహుల్ అంగుళం అయినా అటూ ఇటూ కదల లేదు. మూడేళ్ళు గడిచిపోయినా పార్టీ అధ్యక్ష పదవిని తీసుకోవాలని కార్యకర్తలు, నాయకులు ఎన్నివిథాలుగా వేడుకున్నా, ప్రాధేయ పడినా చివరకు కుటుంబ సభ్యుల నుంచి వత్తిళ్ళు వచ్చినా  ఆయన, మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. మనసు మార్చుకోలేదు  అదే మాట మీద నిలబడ్డారు. అందు చేతనే ఇంచుమించుగా రెండున్నర దశాబ్దాల తర్వాత  కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అనివార్య మయ్యాయి. అయితే కుటుంబ రాజకీయాలకు పర్యాయ పదంగా నిలిచిన కాంగ్రెస్ ‘ఫ్యామిలీ పార్టీ’ ట్యాగ్ వదుల్చుకున్నా  దేశంలో కుటుంబ,వారసత్వ రాజకీయాల హవా మాత్రం అలాగే సాగు తోంది.  నిజానికి, దేశంలో చాలా కాలంగా బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు మినహా మిగిలిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏదో విధంగా కుటుంబ పార్టీలుగానే చెలామణి అవుతున్నాయి.  ఇందుకు తాజా ఉదాహరణ ఆర్జేడీ, డిఎంకే. అది యాద్రుచ్ఛికమే అయినా  రెండు పార్టీలూ ఒకే రోజున ఆదివారం (అక్టోబర్ 9) మరోమారు కుటుంబ పాలనకు జై కొట్టాయి.

ఆర్జేడీ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద యాదవ్ వరసగా 12 వ సారి ఎన్నికయ్యారు. ఎంకే స్టాలిన్ రెండవ సారి డీఎమ్ కే పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లాలూ ప్రసాద యాదవ్  1977లో జనతాదళ్ నుంచి విడిపోయి ఆర్జేడీని స్థాపించినాటి నుంచి, పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాగే  డిఎమ్ కే పెద్దాయన కరుణానిధి కన్నుమూసిన తర్వాత 2018లో పార్టీ అధ్యక్ష  బాధ్యతలు చేపట్టిన స్టాలిన్  వరసగా రెండవసారి పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజానికి  లాలూ, స్టాలిన్ ఎన్నిక ముందుగా ఉహించిందే అయినా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నేపధ్యంగా దేశంలో కుటుంబ ఆధిపత్య రాజకీయాల పై చర్చ జరుగతున్న సమయంలోనే ఆర్జేడీ  డిఎమ్ కే అధ్యక్షులుగా లాలూ, స్టాలిన్ తిరిగి పార్టీపై కుటుంబ జెండా ఎగరేయడంతో జాతీయ మీడియాలో మరో మారు కుటుంబ రాజకీయాలపై చర్చ మొదలైంది. నిజమే  ప్రాంతీయ కుటుంబ పార్టీలలోనే కాదు, బీజేపీ, వామపక్ష పార్టీలు సహా, అన్ని పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం అటూ ఇటుగా ఒకేలా అఘోరించింది. ఇది కాదనలేని నిజం. 

అదలా ఉంటే  పుట్టుక నుంచే కుటుంబ పార్టీగా చెలామణి అవుతున్న డిఎంకే  వ్యవస్థాపకుడు కరుణానిది ఇతర కుటుంబ సభ్యులతో పాటుగా  బంధువులకు కూడా రాజకీయం రుచి చూపించారు. అయినా మొదటి నుంచి పార్టీలో కుమారుడు స్టాలిన్ కే ఎత్తు పీట వేస్తూ వచ్చారు. కరుణానిథి వారసుడు ఎవరు  అనే ప్రశ్న రాకుండా ముందు నుంచే పార్టీలో ప్రభుత్వంలో రెండవ స్థానంలో కుర్చోపెట్టారు.  సో ..కరుణానిథి కన్నుమూసిన తర్వాత ఎలాంటి పోటీ లేకుండా  స్టాలిన్ పార్టీ అధ్యక్ష పదవిని అదే విధంగా ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. ఇప్పుడు రెండవసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  కరుణానిధి చూపిన బాటలోనే స్టాలిన్ తన కుమారుదు ఉదయనిథిని... తన వారసునిగా తీర్చి దిద్దుతున్నారు.

ఇక లాలూ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. దానా కుంభకోణం కేసులో జైలుకు వెళుతూ కూడా లాలూ తన భార్య రబ్డీ దేవిని ముఖ్యమంత్రిని చేసి వెళ్ళారు. అంతే కానీ మరొకరిని నమ్మలేదు.  అలాగే ఆయన తన రెండవ కుమారుడు తేజస్వి యాదవ్ ను తమ రాజకీయ వారసునిగా నిలబెట్టారు. తేజస్వి ప్రస్తుతం బీహార్ ఉపముఖ్య మంత్రిగా ఉన్నారు. లాలూ పెద్ద కుమారుడు ప్రతాప్ యాదవ్ కూడా రాజకీయాల్లో ఉన్నా, ఆయన చిన్న కుమారుడికే పెద్ద పీట వేశారు.

 ఇక తెలుగు రాష్టాల విషయానికి వస్తే ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు టీడీపీ. వైసీపీ కుటుంబ పార్టీలుగానే చెలామణి అవుతున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస విషయం అయితే చెప్పనే అక్కలేదు. పార్టీ ఆవిర్భావం (2001) నుంచి ఈరోజు వరకు కేసీఆరే ఒక్కరే పార్టీ అధ్యక్షునిగా, గత ఎనిమిదేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పడు ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళితే  ఇప్పటికే ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఉన్న కుమారుడు కేటీఆర్ జోడు పదవులను జాయింట్ గా టేకోవర్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. సో... కాంగ్రెస్  మారినా, కుటుంబ , వారసత్వ రాజకీయాలు మాత్రం దేశాన్ని వదిలేదే ..లే అంటున్నాయి.