కాంగ్రెస్ లో ఐక్యత బీటలు వారుతోందా?

వర్గ విభేదాలకూ, గ్రూపు తగాదాలకు అలవాలమైన కాంగ్రెస్ లో అనూహ్యంగా  తెలంగాణలో గత నాలుగైదు నెలలుగా అచ్చెరువు గొల్పే విధంగా ఐక్యత కనిపిస్తోంది. నాయకుల మధ్య ఐకమత్యం, ఒకరికొకరు అండగా నిలుస్తున్న తీరు పరిశీలకులను సైతం విస్మయపరిచింది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ కు పార్టీ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించిన తరువాత ఒక్కసారిగా రాష్ట్ర కాంగ్రెస్ లో కలకలం రేగింది. సీనియర్లు అంటూ కొందరు పార్టీకి రాజీనామాలకు సైతం సిద్ధపడ్డారు. రేవంత్ నాయకత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చారు. అప్పట్లో గాంధీ భవన్ నిత్య కురుక్షేత్రంగా కనిపించేది. అయితే రేవంత్ రెడ్డి ఓపికగా, ఎక్కడా సహనం కోల్పోకుండా స్వయంగా సీనియర్లందరినీ కలిసి వారితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పి కలుపుగోలుతనంతో అందరి మద్దతూ పొందగలిగారు.

ఈ క్రమంలో  పార్టీ హై కమాండ్ కూడా రేవంత్కు అన్ని విధాలుగా అండదండలు అందించింది అది వేరే సంగతి. ఇక  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అయితే కాంగ్రెస్ లో ఐక్యతా రాగం ప్రత్యర్థి పార్టీలను సైతం విస్మయపరిచింది. నేతలంగా కలిసికట్టుగా వ్యవహరించారు. ప్రణాళికా బద్ధంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఫలితం ఎన్నికలలో కాంగ్రెస్ విజయం. పదేళ్ల పాటు కంటి సైగతా రాష్ట్రాన్ని శాసించగలనన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించిన కాంగ్రెస్ ఐక్యత బలమేమిటో గ్రహించిందా అన్నట్లుగా ప్రభుత్వ ఏర్పాటు తరువాత కూడా ఐక్యంగానే కదులుతూ వచ్చింది. ముఖ్యమంత్రి పదవి విషయంలో మల్లు భట్టి విక్రమార్క్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తమకూ స్టేక్ ఉందంటూ హస్తిన వరకూ వెళ్లి ప్రయత్నాలు చేసినా అధిష్టానం ఆదేశాల మేరకు వారు రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవులతో సరిపెట్టుకున్నారు.

ఇక అక్కడ నుంచీ కేబినెట్ సమష్టి తత్వం అంటే ఇలా ఉండాలి అనేగా రేవంత్ సర్కార్ సాగింది. మంత్రులంతా ఒకే మాట మీద ఉంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలను సమర్ధంగా తిప్పికొట్టారు. మరీ ముఖ్యంగా అసెంబ్లీలో కేబినెట్ మంత్రులకు అండగా రేవంత్ గళం విప్పడం, రేవంత్ ప్రసంగానికి మంత్రలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ బల్లలు చరుస్తూ మద్దతు పలకడం వంటి దృశ్యాలు కాంగ్రెస్ లో మారిన పరిస్థితికి అద్దం పట్టాయి. 

తాజాగా ప్రభుత్వం నుంచి విడుదలైన ఒక ప్రకటన కాంగ్రెస్ లో ఐక్యత మూడు నెలల ముచ్చటగానే మిగిలిపోతున్నదా అన్న అనుమానాలకు కలిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున విడుదలైన ఆ అడ్వర్టైజ్ మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ఆ యాడ్ ఏమిటి అన్న విషయానికి  వచ్చే ముందు రేవంత్ సర్కార్ కొలువుదీరిన తరువాత కాంగ్రెస్ లో కనిపించిన సమష్టి తత్వం ఎలా ఉందో చెప్పుకుందాం.

రాష్ట్రంలో రేవంత్ నాయకత్వంలోని ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు జంటకవుల్లా కలిసే కనిపించారు.  హస్తిన పర్యటనకు వెళ్లినా, సమీక్షలకు వెళ్లినా ఇరువురూ కలిసే వెళ్లారు. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన యాడ్స్ లోనూ, పలు హోర్డింగ్ లపైనా కూడా రేవంత్, మల్లు భట్టి విక్రమార్కల ఫొటోలు తప్పనిసరిగా కనిపించేవి. అదో యూనిటీ సింబల్ గా రాష్ట్ర ప్రజల మనస్సుల్లో ముద్రపడిపోయింది. కానీ తాజాగా  ప్రభుత్వం ఉద్యోగులకు నియామకపత్రాలను అందజేసిన కార్యక్రమానికి సంబంధించిన ప్రభుత్వ అడ్వర్టైజ్ మెంట్ లో  ముఖ్యమంత్రి రేవంత్ ఫొటో మాత్రమే కనిపించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫొటోకు ఆ అడ్డర్టైజ్ మెంట్ లో చోటివ్వలేదు. ఔను మొత్తం 5, 192 పోస్టులకు సంబంధించి నియామకపత్రాలు అందజేసే కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో  సోమవారం (మార్చి 4) న జరిగింది. అందుకు సంబంధించి ప్రభుత్వం ఒక అడ్వర్టైజ్ మెంట్ పత్రికలకు విడుదల చేసింది. ఆ అడ్వర్టైజ్ మెంట్ లో మల్లు భట్టి విక్రమార్క ప్రస్తావనే లేదు. రేవంత్ ఫొటోను మాత్రమే ప్రముఖంగా కనిపించింది.

దీంతో రేవంత్, మల్లు మధ్య విభేదాలు పొడసూపాయా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతున్నాయి.  కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఇంతకీ మల్లు ఫొటో లేకుండా యాడ్ రావడం వెనుక కారణమేమిటన్నది మాత్రం తెలియడం లేదు. ఐఆండ్ పీఆర్ వర్గాలేమో పార్టీ నుంచి వచ్చిన ఫార్మాట్ ప్రకారమే తాము యాడ్ విడుదల చేశామంటున్నారు. పార్టీ వర్గాలేమో అది ఐఅండ్ పీఆర్ ఇచ్చిన యాడ్ తమకు సంబంధం లేదని అంటున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ లో ఐక్యత బీటలు వారుతోందా అన్న అనుమానాన్ని మాత్రం ఈ అడ్వర్టైజ్ మెట్ కలిగించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.