అమరావతి రైతుల ఖాతాల్లో ఆ సొమ్ములు జమ.. చంద్రబాబు సంక్రాంతి కానుక
posted on Jan 15, 2025 1:55PM
అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి కానుక అందించారు. గత ఏడాదిన్నరగా నిలిచిపోయిన కౌలు సొమ్మును వారి ఖాతాలలో జమ చేశారు. అమరావతి రాష్ట్ర రాజధాని కావాలని కోరుతూ ల్యాండ్ పూలింగ్ ద్వారా తమ భూములను అందించిన రైతులకు సీఆర్డీయే పరిధిలో వాణిజ్య, నివాస స్థలాలలో పాటు రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకూ కౌలు చెల్లిస్తామని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతులతో ఒప్పందం చేసుకున్న సంగతి విదితమే.
అయితే జగన్ హయాంలో అమరావతిని నిర్వీర్యం చేయడంతో పాటు కౌలు కూడా నిలిపివేసింది జగన్ సర్కార్.అయితే రైతులు న్యాయపోరాటం చేశారు. హైకోర్టు ఆదేశాలతో జగన్ సర్కార్ దిగి వచ్చి విడతల వారీగా కౌలు సొమ్ములను అమరాతి రైతుల ఖాతాలో జమ చేస్తూ వచ్చింది. కానీ ఎన్నికల ఏడాదది ముందు నుంచి రైతులకు కౌలు సొమ్ముల జమను నిలిపివేసింది. ఎన్నికలలో జగన్ సర్కార్ ఘోర పరాజయం పాలు కావడం, చంద్రబాబు నేతృత్వంలో కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గత ఏడాదిన్న కాలంగా పెండింగ్ లో ఉన్న అమరావతి రైతుల కౌలు సొమ్ములను సరిగ్గా పండుగ వేళ వారి ఖాతాలో జమ అయ్యాయి. దీనిపై హర్షం వ్యక్తం చేసిన అమరావతి రైతులు చంద్రబాబుకు కృతజ్ణతలు తెలిపారు.
అంతే కాకుండా జగన్ హయాం అప్పట్లో అమరావతి మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా ఆర్5 జోన్ ఏర్పాటు చేసి.. ఆ ప్రాంతంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారికి చేసిన భూ కేటాయింపులను కూడా చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసి ఆ భూములను తిరిగి సీఆర్డేయేకు అప్పగించింది. అమరావతి రైతులకు ప్రయోజనం కలిగేలా తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు తీసుకున్న ఈ రెండు నిర్ణయాల పట్లా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.