కాంగ్రెస్ ను గెలిపించాలన్న రోశయ్య
posted on Apr 23, 2011 12:05PM
కడప: దివంగత నేత వై
యస్ రాజశేఖర రెడ్డి ఏ రోజు కూడా పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించలేదని మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. తాను 1972 నుంచి వైయస్‌తో ఉన్నానని, వైయస్ రాష్ట్ర ప్రభుత్వంపై, రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేసిన సందర్భాలున్నాయి గానీ అఖిల భారత కాంగ్రెసు నాయకత్వాన్ని ఏనాడూ విమర్శించలేదని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కడప లోక్ సభ, పులివెందుల శాసనసభ స్థానాల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. కాంగ్రెసును ఓ ప్రత్యేక కోణంలో చూడాలని ఆయన సూచించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్ని ఖచ్చితంగా అమలు అవుతాయన్నారు. వైఎస్ రాజకీయ వారసత్వం ముమ్మాటికీ కాంగ్రెస్‌దేనని ఆయన చెప్పుకొచ్చారు.
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రయోజానాలు ఎక్కువ చేకూరుతాయని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీతో ఇతర ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలను బేరీజు వేసుకుని కాంగ్రెసును బలపరచాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలను కూడా బేరీజు వేసుకుని ఓటు వేయాలని ఆయన సూచించారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసిందన్నారు. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి కాంగ్రెసు పార్టీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు.