పాపం కమ్యూనిస్టులు!

ఖమ్మం లో తగ్గుతున్న ప్రాభవం
జిల్లాలో బలహీన పడిన కామ్రేడ్స్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీల ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు జిల్లాలో రాజకీయాలను శాసించిన కామ్రేడ్లు నేడు దాదాపుగా జీరోకు చేరుకున్నారు. 1980 లో జరిగిన సమితి ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు (సీపీఎం,సీపీఐ) జిల్లా లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 1983 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎన్టీఆర్ ప్రభంజనాన్ని  తట్టుకొని మరీ సముచిత స్థానాలు దక్కించుకున్నారు. ఆ తరువాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల్లో నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో కలసి పనిచేయడం, ఎన్నికలలోనూ ఐక్యంగానే పోటీ చేయడం ప్రారంభించారు. ఆ రకంగా 1994 వరకు కలసి పోటీ చేసి గణనీయంగా లబ్ధి పొందారు.  మధ్యలో ఒకటి రెండు సార్లు తెలుగుదేశంతో విభేదించినా పలు ఎన్నికల్లో కలసి పోటీచేశారు. 1999 నుంచీ ఆ పార్టీకి దూరంగా ఉన్నారు.  

ఆ తర్వాత 2004 లో కాంగ్రెస్ తో కలసి పోటీచేసి మంచి ఫలితాలు సాధించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ తో కలసి పోటీచేసిన ప్రతిసారి కమ్యూనిస్టులకు జిల్లాలో మంచి ఫలితాలు వచ్చాయి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా గా ఉన్న సమయంలోనే కమ్యూనిస్టులు కాస్త దూరంగా ఉండటం ప్రారంభించారు. ముదిగొండ లో ఇళ్ల స్థలాల కోసం జరిగిన ఆందోళనలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఐదుగురు సీపీఎం కార్యకర్తలు చనిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సీపీఎం కు దూరం పెరిగింది.

ఆ తర్వాత సీపీఎం జిల్లా నాయకత్వంలో జరిగిన పరిణామాలతో సీనియర్ కామ్రేడ్ లు కొందరు కాంగ్రెస్ లో చేరిపోయారు. అప్పటి నుంచి జిల్లాలో సీపీఎం బలహీనపడింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో సీపీఎం ఆ ఉద్యమానికి దూరంగా ఉంది. సీపీఐ మాత్రం ఉద్యమంలో భాగస్వామి అయింది.  తెలంగాణ ప్రకటన నేపథ్యంలో 2014 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరిగా పోటీచేసిన సీపీఎం ఖమ్మం జిల్లాలో  మాత్రం  విచిత్రంగా వైసీపీ తో పొత్తు పెట్టుకుంది. సీపీఐ మాత్రం కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది . సీపీఎం ఒక్క భద్రాచలం అసెంబ్లీ ని మాత్రమే గెలుచుకుంది. సీపీఐ ఒక్క స్థానం కూడా గెలవలేదు.  

అప్పటి నుంచి జిల్లాలో కమ్యూనిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. సీపీఎం, సీపీఐ ల మధ్య కూడా సంత్సంభందాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.  అంతేకాదు రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో లో 7 స్థానాల్లో 2018  స్థానాల్లో 8, 2023 లో 8 స్థానాల్లో ఆ పార్టీ నే గెలిచింది. కొత్తగూడెం లో ఆ పార్టీ మద్దతు తో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు.

అసెంబ్లీ ఎన్నికలే కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి. జిల్లాలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతుదారులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు జిల్లాలో కమ్యూనిస్టు పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది.. సీపీఎం ఖమ్మం టౌన్, భద్రాచలం ప్రాంతంలో కాస్త క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తోంది. సీపీఐ ఖమ్మం రూరల్ ప్రాంతంతో పాటు కొత్తగూడెం నియోజకవర్గంలో కనిపిస్తోంది.. ఇక సీపీఐ (ఎంఎల్) పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగానే ఉంది. ఆ పార్టీ లో సైద్ధాంతిక విభేదాల తో విడిపోయి బలహీనపడున్నారు. జిల్లాలో ఇప్పట్లో కమ్యూనిస్టు పార్టీలు పూర్వ వైభవం సంతరించుకోవడమనేది అసాధ్యంగానే కనిపిస్తోంది.