సన్ రైజర్స్ పరుగుల సునామీ..పంజాబ్ పై అద్భుత విజయం
posted on Apr 12, 2025 12:54AM

అభిషేక్ వర్మ మెరుపు సెంచరీ..
245 పరుగుల లక్ష్యం 18.3 ఓవర్లలోనే ఛేదన
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. ఆ వర్షంలో క్రికెట్ అభిమానులు తడిసి ముద్దైపోయారు. క్రికెట్ మజా ఏమిటో ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో శనివారం రాత్రి హైదరాబాద్ సన్ రైజర్, పంజాబ్ కింగ్స జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూస్తే అర్ధమౌతుంది. ఐపీఎల్ లో భాగంగా శనివారం రాత్రి సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద పారింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఎవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోరు చేసింది. సన్ రైజర్స్ ముందు దాదాపు అసాద్యమైన లక్ష్యాన్ని ఉంచింది. ఇప్పటికే వరుసగా నాలుగు పరాజయాలతో నీరసించి ఉన్న సన్ రైజర్స్ ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమేనని అంతా భావించారు.
అయితే సన్ రైజర్స్ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. కొండంత లక్ష్యాన్ని అలవోకగా కేవలం రెండే వికెట్లు కోల్పోయి ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసి అద్భుతం సృష్టించింది. సన్ రైజర్స్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వారి బ్యాటింగ్ ధాటికి పంజాబ్ ఫీల్డర్స్ కూడా ప్రేక్షుకులుగా మారిపోయారు.
భారీ స్కోరు ఛేదనలో సన్ రైజర్స్ కు అద్భుత ఆరంభం దక్కింది. ఓపెనర్లిద్దరూ చెలరేగి ఆడారు. అభిషేక్ శర్మ (55 బంతుల్లో 14 ఫోర్లు.. 10 సిక్సర్లతో) 141, ట్రావిస్ హెడ్ (37 బంతుల్లో 9 పోర్లు, 3 సిక్సర్లతో ) 66 చెలరేగి ఆడటంతో మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది. వీరిరువురూ కలిసి తొలి వికెట్ కు 12.2 ఓవర్లలోనే 170 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత హెడ్ ఔటైనా అభిషేక్ తన పరుగుల వరద కొనసాగించాడు. ఆ తరువాత అభిషేక్ వర్మ ఔటైనా అప్పటికే సన్ రైజర్స్ విజయం ఖరారైంది. చివర్లో క్లాసన్(21), కిషాన్ (9) మ్యాచ్ ను ముగించేశారు.