ఇంతకీ ఉప ఎన్నికలు ఎప్పుడు?
posted on Apr 20, 2012 10:50AM
రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనలకి, రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనలకి పొంతన లేకపోవడం ఇందుకు కారణం. దేశంలోంని ఖాళీ అయిన అన్ని స్థానాలకు కలిపి ఎన్నికలు నిర్వహిస్తామని, అందుకుగాను మొత్తం ఖాళీలు, ఆయజా రాష్ట్రాలలోని పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నామని, వివరాలు అందిన తర్వాత ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించగా, రాష్ట్ర ఎన్నికల అధికాని భన్వర్ లాల్ మాత్రం ఉప ఎన్నికలు రంగం సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు.
ఉప ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్ల విషయంలో తెలుగుదేశంపార్టీ మాత్రమే ముందుంది. ఉప ఎన్నికలు జరగబోయే 18 స్థానాలకుగాను 16 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది. సిపీఐ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధమైంది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున తాజా మాజీ శాసనసభ్యులే అభ్యర్థులుగా వుంటారు. అయితే ఒకటి రెండు స్థానాల్లో మాత్రం తాజా మాజీ పోటీకి సిద్ధంగా లేరు. అదేవిధంగా తెలంగాణాలోని పరకాల స్థానం విషయంలో కూడా స్పష్టత లేకుండా వుంది. ఇక్కడ తాజా మాజీగా వున్న మాజీమంత్రి కొండా సురేఖ స్వతంత అభ్యర్థిగా రంగంలోకి దిగాలనుకొంటుంటే వై.ఎస్.ఆర్. పార్టీ నేతలు మాత్రం ఆమెను పార్టీ తరపున పోటీకి దించాలని, లేదంతే పార్టీకి కోస్తాలో పరువుపోతుందని ఆ పార్టీ ద్వితీయశ్రేణి నేతలు. అభిమానులు పట్టుబడుతున్నట్టు తెలిసింది.
అధికారపార్టీ కాంగ్రెస్ లో పరిస్థితి మరింత గందరగోళంగా వుంది. ఉప ఎన్నికల అభ్యర్థులు ఎవరో ఇంకా నిర్థారణ కాలేదు. తక్షణం ఎన్నికలు జరిగినా లేదా మరో మూడు నెలలకు జరిగినా ఆఖరిక్షణం వరకు అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం లేదనిపిస్తోంది. ఉప ఎన్నికలు జరిగే అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీకి చెందినవి కావడం వల్ల ఒక స్థానంలో ఓడిపోయినా పార్టీకి నష్టమే. కాని వాస్తవ పరిస్థితులు చూస్తుంటే కనీసం ఒక స్థానంలో గెలిచే పరిస్థితి కూడా కనిపించడం లేదు. రాష్ట్రంలో నెలకొని వున్న అనేక పరిస్థితులకు తోడు అదనంగా ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? అనే అంశంపై కూడా చర్చ కొనసాగుతోంది.