సహనటుడిపై రూ. 5 కోట్ల పరువు నష్టం దావా వేసిన కమెడియన్‌!

ఈమధ్యకాలంలో సినిమా రంగంలో కోర్టు, వివాదాలు, పరువు నష్టం దావాలు, వివిధ నేరారోపణలు అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కేసు కోర్టు వరకు వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైన తమిళ హాస్యనటుడు వడివేలు. 35 సంవత్సరాలుగా ఎన్నో డబ్బింగ్‌ సినిమాల ద్వారా తన హాస్యంతో అలరించిన ఆయన ఇప్పుడు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. తన సహనటుడు, మిత్రుడు అయిన సింగముత్తుపై రూ.5 కోట్లకు పరువు నష్టం దావా వేశారు వడివేలు. 

వడివేలు చేసిన ఫిర్యాదులో ఏముందంటే.. తాను 1991 నుంచి నటుడిగా కొనసాగుతున్నానని తెలిపారు. 2000 సంవత్సరం నుంచి సహనటుడు సింగముత్తుతో కలిసి కొన్ని సినిమాలు చేశానని పేర్కొన్నారు వడివేలు. అయితే అతని కంటే తనకు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రావడం సింగముత్తు సహించలేకపోతున్నాడని, అందుకే తనపై పలు ఆరోపణలు చేస్తున్నాడని వివరించారు. తాంబరంలోని ఓ స్థలం ఎగ్మోర్‌ కోర్టులో వివాదంలో ఉంది. దాన్ని  తనతో కొనిపించాడని తెలిపారు. అంతేకాకుండా, కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌లో సింగముత్తు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, అబద్దాలు ప్రచారం చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడని ఆరోపించారు వడివేలు. అతని నుంచి తనకు రూ.5 కోట్లు పరువు నష్టాన్ని ఇప్పించాలని కోర్టును కోరారు. వడివేలు పిటిషన్‌ను స్వీకరించిన చెన్నయ్‌ హైకోర్టు రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని సింగముత్తుకి నోటీసులు జారీ చేసింది. వీరిద్దరి వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరికి అనుకూలంగా తీర్పు వస్తుందో చూడాలి.