తెలుగుదేశం కోట ఉమ్మడి అనంతపురం జిల్లా!
posted on Mar 15, 2024 11:25AM
రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి గట్టిపట్టున్న జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా. మొదటి నుంచి ఈ జిల్లాలో తెలుగుదేశం హవా కొనసాగుతూనే ఉంది. 2019లో మాత్రం ఉమ్మడి జిల్లా ప్రజలు వైసీపీవైపు మొగ్గుచూపారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అస్తవ్యస్త పాలన, కక్షపూరిత రాజకీయాలు, కనీస అభివృద్ధి కూడా లేకపోవడంతో విసిగిపోయిన జిల్లా ప్రజలు మళ్లీ తెలుగుదేశం వైపు మొగ్గుచూపుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటేనే ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు గట్టిగా చెబుతున్నారు. జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకతకు తోడు ఈసారి జనసేన, బీజేపీకూడా తెలుగుదేశం కలిసివస్తుండటం కలిసొచ్చే అంశంగా మారింది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఈసారి తెలుగుదేశం క్లీన్ స్వీప్ ఖాయమని పరిశీలకులే కాదు, పలు సర్వేలు కూడా చెబుతున్నాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ జిల్లాలో మెజార్టీ స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తున్నది. ఇప్పటికే రెండు విడతల్లో పదకొండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వాటిలో హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రాప్తాడు (పరిటాల సునీత), హిందూపురం ( నందమూరి బాలక్రిష్ణ), పెనుకొండ (సవితమ్మ), పుట్టపర్తి (పల్లె సింధూరా రెడ్డి), కదిరి (కందికుంట యశోదాదేవి), మడకశిర (సునీల్ కుమార్) నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. అదే విధంగా అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కళ్యాణదుర్గం (సురేంద్రబాబు), ఉరవకొండ (పయ్యావుల కేశవ్), రాయదుర్గం (కాల్వ శ్రీనివాసులు), తాడిపత్రి (జేసీ అస్మిత్ రెడ్డి), శింగనమల (బండారు శ్రావణి) నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా.. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అనంతపురం నియోజకవర్గం పరిధిలో అనంతపురం అర్బన్, గుంతకల్లు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక నియోజకవర్గాల వారీగా పరిస్థితులను పరిశీలిస్తే...
అనంతపురం అర్బన్
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ప్రభాకర్ చౌదరిపై వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి విజయం సాధించారు. కూటమిలో భాగంగా నియోజకవర్గంలో టికెట్ ఏ పార్టీకి కేటాయిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం రెండు జాబితాలు విడుదల చేసినా ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రభాకర్ చౌదరితోపాటు పలువురు తెలుగుదేశం నేతలు కూడా ఈ నియోజకవర్గం సీటు కోసం పోటీ పడుతున్నారు.
ఉరవకొండ నియోజకవర్గం
ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వై. విశ్వేశ్వర రెడ్డిపై పయ్యావుల విజయం సాధించాడు. మరోసారి వీరిద్దరి మధ్యే పోటీ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ కు మంచి ఆదరణ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశారు. నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ వచ్చారు. దీనికి తోడు ప్రజల సమస్యల పరిష్కారంలో పయ్యావుల ముందుంటారని పేరుంది. దీంతో ఈ నియోజకవర్గంలో మరోసారి పయ్యావుల గెలుపు ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గం
2019 ఎన్నికల్లో కల్యాణ దుర్గం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి మాదినేని ఉమామహేశ్వర నాయుడుపై వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ విజయం సాధించారు. ఆమెను జగన్ ఈసారి పెనుగొండ నియోజకవర్గానికి మార్చేశారు. ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశంఅభ్యర్థిగా సురేంద్రబాబు పోటీ చేస్తున్నారు. ఉషశ్రీ స్థానంలో వైసీపీ అధిష్టానం సమన్వయకర్త గా తలారి రంగయ్యను నియమించింది. అయితే ఈ నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా అబివృద్ధి కార్యక్రమాలు పెద్దగా జరగలేదు. దీంతో ప్రజలు వైసీపీ పాలనపై అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు వైసీపీలోని వర్గ విబేధాలు తెలుగుదేం అభ్యర్థి విజయాన్ని సునాయసం చేయనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గుంతకల్లు నియోజకవర్గం
2019 ఎన్నికల్లో గుంతకల్లు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా జితేంద్ర గౌడ్ పోటీచేసి ఓడిపోయాడు. వైసీపీ అభ్యర్థి వై.వెంకటరామి రెడ్డి విజయం సాధించాడు. ఈ నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్త, ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి బీసీలను అవమానిస్తున్నారని ఆ సామాజిక వర్గం ఆగ్రహంతో ఉంది. దీనికి తోడు ఆ నియోజకవర్గంలో వైసీపీలో వర్గవిబేధాలు తార స్థాయికి చేరాయి. మరో వైపు కూటమి అభ్యర్థిగా ఈ నియోజకవర్గంనుంచి ఇంకా ఎవరికీ టికెట్ కేటాయించలేదు. కూటమిలో భాగంగా ఈనియోజకవర్గం టికెట్ బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. కూటమి తరఫున ఎవరు బరిలోకి దిగినా గెలుపు నల్లేరుమీద బండి నడకేనని అంటున్నారు.
తాడిపత్రి నియోజకవర్గం
తాడిపత్తి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ అస్మిత్ రెడ్డి ఓడిపోయారు. అయినా మరోసారి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జేసీ అస్మిత్ రెడ్డికే అవకాశం ఇచ్చారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నియోజకవర్గ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కేతిరెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి కంటే.. ఘర్షణలకు, ఫ్యాక్షన్ తరహా రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా కేతిరెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నట్లుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈసారి ఈ నియోజకవర్గంలో కూటమి జెండా ఎగరడం ఖాయమని పలు సర్వేలు పేర్కొన్నాయి.
రాయదుర్గం నియోజకవర్గం
2019 ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కాల్వ శ్రీనివాసులుపై వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి విజయం సాధించాడు. అయితే, ఈ సారి రామచంద్రారెడ్డికి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా మెట్టు గోవిందరెడ్డి కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులు మరోసారి పోటీ చేయనున్నారు. నియోజకవర్గంలో వైసీపీలో వర్గవిబేధాలు తార స్థాయికి చేరాయి. దీనికితోడు ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడటంతో ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. కూటమి అభ్యర్థి కాల్వ శ్రీనివాసులుకు నియోజకవర్గం ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. దీనికి తోడు బీజేపీ, జనసేన మద్దతుకూడా తోడుకావటంతో ఈసారి శ్రీనివాసులు విజయం నల్లేరుపై బండినడకేనని పరిశీలకులు పేర్కొంటున్నారు.
శింగనమల నియోజకవర్గం
2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి పై వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి విజయం సాధించారు. ఈసారి వైసీపీ అధిష్టానం పద్మావతిని తప్పించి ఆమె స్థానంలో నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా వీరాంజనేయులను నియమించింది. వీరాంజనేయులు పట్ల నియోజకవర్గంలోని వైసీపీ నేతలు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు సహకరించేది లేదని పలువురు వైసీపీ నేతలు ఇప్పటికే బాహాటంగా చెప్పేశారు. దీనికి తోడు వైసీపీలో వర్గవిబేధాలు తార స్థాయికి చేరాయి. ఇదిలా ఉంటే.. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవటంతో ప్రజలు వైసీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం అభ్యర్థిగా మరోసారి శ్రావణి బరిలోకి దిగుతున్నారు. ఐదేళ్ల కాలంలో నియోజకవర్గ ప్రజలకు శ్రావణి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. దీంతో ఆమె పట్ల ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో బండారు శ్రావణీ విజయం ఖాయమని అంటున్నారు.
కదిరి నియోజకవర్గం
2019 ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుంచి పెడబల్లి వెంకట సిద్దారెడ్డి విజయం సాధించాడు. అయితే ఈసారి వైసీపీ అధిష్టానం వెంకట సిద్దారెడ్డిని పక్కనపెట్టి కదిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మక్బూల్ అహ్మద్ ను ప్రకటించింది. అయితే, హైకమాండ్ నిర్ణయాన్ని ప్రస్తుత ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. మంత్రి పెద్దారెడ్డి పలుసార్లు అసంతృప్త నేతలతో చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు. మరోవైపు ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కందికుంట యశోదాదేవి (టీడీపీ) పోటీ చేస్తున్నారు. వైసీపీలో వర్గవిబేధాలకు తోడు.. నియోజకవర్గంలో గత ఐదేళ్ల కాలంలో అభివృద్ధి జరగకపోవటం యశోదాదేవి విజయానికి దోహదపడతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ధర్మవరం నియోజకవర్గం
తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతున్నది. అయితే, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఇప్పటి వరకూ ఎవరినీ నియమించలేదు. వైసీపీ నుంచి మరోసారి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బరిలోకి దిగనున్నారు. అయితే కేతిరెడ్డిపై నియోజకవర్గంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పరిటాల శ్రీరామ్ గత నాలుగేళ్లుగా ఈ నియోజకవర్గంలో పట్టు పెంచుకున్నారు. పరిటాల శ్రీరామ్ కు టికెట్ ఇస్తే విజయం నల్లేరుపై నడక అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇస్తే పరిటాల శ్రీరామ్ సహకారంపై ఆయన విజయావకాశాలు ఆధారపడి ఉంటాయన్న చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతోంది.
పుట్టపర్తి నియోజకవర్గం
పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సంధూరారెడ్డికి తెలుగుదేశం అధిష్టానం టికెట్ కేటాయించింది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డిపై వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి విజయం సాధించాడు. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ప్రజల అసహనం, మరోవైపు రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలనపై వ్యక్తమౌతున్న తీవ్ర ఆగ్రహం కారణంగా సింధూరారెడ్డి విజయానికి ఢోకాలేదని అంటున్నారు.
పెనుకొండ నియోజకవర్గం
పెనుగొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా సవితమ్మ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతీగడపకు వెళ్లి ఆమె ప్రచారం చేశారు. 2019లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి బీకే పార్థసారధిపై వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర నారాయణ విజయం సాధించారు. ఈసారి వైసీపీ అధిష్టానం ఈ నియోజకవర్గంలో సమన్వయకర్తగా మంత్రి ఉషశ్రీ చరణ్‌ను నియమించింది. ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నది. వర్గ విబేధాలు చాపకిందనీరులా విస్తరిస్తున్నాయి. తెలుగుదేశం అభ్యర్థి సవితమ్మ విజయం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే పలు సర్వే ఫలితాలు కూడా సవితమ్మదే విజయమని తేల్చేశాయి.
మడకశిర నియోజకవర్గం
మడకశిర నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఎం. తిప్పేస్వామి టీడీపీ అభ్యర్థి ఈరన్నపై విజయం సాధించారు. అయితే, ఈసారి వైసీపీ అధిష్టానం ఈరలక్కప్పను సమన్వయకర్తగా నియమించింది. దీంతో వైసీపీలో వర్గవిబేధాలు భగ్గుమన్నాయి. దీనికి తోడు గత ఐదేళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థి సునీల్ కుమార్ కు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. దీనికి తోడు జనసేన, బీజేపీ ఓట్లుకూడా తోడుకానుండటంతో సునీల్ కుమార్ విజయం ఖాయమని పరిశీలకులు పేర్కొంటున్నారు.
రాప్తాడు నియోజకవర్గం
రాప్తాడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పరిటాల సునీత పోటీ చేస్తున్నారు. గతంలో ఈ నియోజకవర్గంలో పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీచేసి వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. మరోసారి ప్రకాశ్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారు. అయితే, గత ఐదేళ్ల కాలంలో ప్రకాశ్ రెడ్డిపై నియోజకవర్గం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోవడంతోపాటు.. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. దీనికితోడు ఈసారి ఈ నియోజకవర్గం నుంచి పరిటాల సునీత బరిలోకి దిగుతున్న నేపథ్యంలో కూటమి అభ్యర్థి విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు సర్వే ఫలితాల్లో పరిటాల సునీత గెలుస్తారని తేలింది.
హిందూపూర్ నియోజకవర్గం
హిందూపురం నియోజకవర్గం నుంచి మరోసారి నందమూరి బాలక్రిష్ణ తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో బాలయ్య ఇక్కడ నుంచి విజయం సాధించారు. మూడోసారి హ్యాట్రిక్ కొట్టేదుకు సిద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానం కోడూరు దీపికను బరిలోకి దింపుతోంది. అయితే ఆమె అభ్యర్థిత్వం పట్ల పలువురు వైసీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా నియోజకవర్గం ప్రజలకు వైద్య, విద్య అందిస్తూ బాలయ్య నియోజకవర్గ ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నారు. దీంతో బాలయ్యవైపే మెజార్టీ ప్రజలు మొగ్గుచూపుతున్నారు. మరోసారి బాలయ్య గెలుపు ఖాయమే అంటున్నారు.