తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా!
posted on Dec 24, 2025 9:13AM
.webp)
తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసిరింది. ఈ నెల తొలి వార నుంచీ ప్రారంభమైన చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. డిసెంబర్ రెండో వారంలోనే చలిపులి తెలుగు రాష్ట్రాలను వణికించడం మొదలైంది. ఉదయం, రాత్రి వేళల్లో చలి గాలులకు తోడు దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఆందోళనకర స్థాయిలో పడిపోయాయి.
దీంతో తెలుగు రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదౌతున్నాయి. తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌లో అత్యల్పంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్, ఆసీఫాబాద్, వికారాబాద్, మెదక్, కామారెడ్డిలో సైతం ఉష్ణాగ్రతలు భారీగా పడిపోయాయి. ఇక హైదరాబాద్‌లో సాధారణంగా 10 నుంచి 12 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండగా.. నగర శివారు ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి.
అలాగే ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అరకు, పాడేరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉదయం, రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి విపరీతంగా ఉన్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులతోపాటు శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ కోల్డ్ వేవ్ ఈ నెలాఖరువరకూ కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.