ఆగస్టులో కిరణ్ కుమార్‌కు పదవీ గండం ?
posted on Jul 13, 2012 5:31PM
ఆగస్టు నెల అంటేనే రాజకీయనాయకులు బంబేలెత్తుతారు. ఎందుకంటె ఈ నెల రాజకీయ సంక్షోభాలకు మారుపేరు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆగస్టు ఆయన్ని ముప్పతిప్పలు పెట్టింది. ఎన్టీరామారావును నాదేళ్ల భాస్కరరావునుండి వెన్నుపోటు పొడిచారు. సంవత్సరం తర్వాత చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ను గద్దె దింపి పార్టీని తన హస్తగతం చేసుకోవడం కూడా ఈ నెలలోనే జరిగింది. మరి వచ్చే ఆగస్టు ఎలావుండ బోతోందో కొంచెం తెలుసుకుందాం.
ఈ ఆగస్టు 8 నుండి 18 వరకు రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని జ్యోతిశాస్త్రపండితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి మారతారని కూడా ఘంటాపథంగా చెబుతున్నారు. కిరణ్‌కుమార్‌కు గత సంవత్సరం శని ఉచ్చదశలో ఉన్నందున ఏవరూ ఊహించని విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారని, ఈ సంవత్సరం కిరణ్‌కుమార్ జాతకంలో శని వక్రదశలో కన్యను చూడటం వల్ల ఆయనకు పదవీ గండం తప్పదని ఆయనకు ఆగస్టు అంతా క్షణం ఒక యుగంలా గడుస్తుందని కూడా చెబుతున్నారు.
అలాగే ఆగస్టు 15న, కుజ శని కలయిక వల్ల కూడా రాష్ట్రరాజకీయాలలో పెను మార్పులు ఉంటాయన్నారు. అయితే ఈ మార్పులన్నీ రాష్ట్రానికి మంచిదే అని కూడా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడతూ, ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించే వారికి గుడ్ లక్ చెప్పడం విశేషం. గతంలో రోశయ్య కూడా రాజీనామా చేయడానికి కొద్దిరోజుల ముందు విలేఖరులడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘‘నన్నేం చేయమంటారు . పదవికి రాజీనామా చేయంటారా?‘‘ అని ఆగ్రహంతో అన్నారు. తధాస్తు దేవతలు తధాస్తు అన్నారో ఏమోగాని కొద్ది రోజులకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కిరణ్ కుమార్ తన పదవిపై కన్నేసిన వారికి గుడ్ లక్ చెప్పడం విశేషం.