21న వల్లభనేని వంశీ జంప్ ?
posted on Jul 13, 2012 5:37PM
కృష్ణాజిల్లాలో కొడాలినానీతో మొదలైన వలసలు ఎప్పటికి ముగుస్తాయో తెలియటం లేదు. నిన్న పోలిట్‌బ్యూరో అధికారిగా ఉన్న ఉప్పులేటి కల్పన, ఇప్పుడు గన్నవరంకు చెందిన వల్లభనేని కూడా లైన్ క్లియర్ అయ్యిందనే అనుకుంటున్నారు. ఈ నెల 21న వైసిపిలో చేరటానికి ముహూర్తం ఖరారైందని కూడా చెబుతున్నారు. అయితే ఇదే జిల్లాలో నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యకు మాత్రం వైసిపి లోకి వెళ్లే చాన్సు కనబడటంలేదు. ఇప్పటికే నూజివీడునుండి వైసిపి నాయకుడుగా ఉన్న మాజీ ఎమ్మేల్యే ప్రతాప్ ఆయనను వైసిపిలోకి రాకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తుంది. లేదంటే చిన్నం కూడా ఇదే వరుసలో ఉండేవారు.
కృషజిల్లాలో తెలుగుదేశం నాయకులంతా క్యూ కట్టటానికి కారణం దేవినేని ఉమ అని తెలుస్తుంది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్‌కి సన్నిహితులుగా ఉంటున్న వారందరికి చంద్రబాబునాయుడు వేటువేయటం తద్యమని తెలియటంతో పార్టీలో జంప్‌జిలానీలు ఎక్కువవుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికలప్పుడు చంద్రబాబునాయుడు ఎంపీగా పోటీచేయడానికి సరైన సమయంలో పార్టీ టికెట్ ఇవ్వకుండా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారనేది వంశీ ఆరోపణ. తనకు దేవినేని నెహ్రూకు పార్టీలోని కార్యకర్తలకోసమే గొడవ జరిగినా చంద్రబాబునాయుడు పట్టించుకోలేదని కూడా వంశీ వాపోతున్నట్లు తెలిసింది.
ఈసారి ఎలాగూ తెలుగుదేశంపార్టీ తరపున టికెట్ ఇస్తారన్న గ్యాంరెంటీ లేక పోవడం కూడా ఒక కారణం. గన్నవరం ఎం.పి.టిక్కెట్ దాసరిబాలవర్ధనరావుకు , విజయవాడ టిక్కెట్ లింగమనేని రమేష్‌కు దక్కుతాయని సంకేతాలు అందటంతో తెలుగుదేశంపార్టీలో రాజకీయ భవిష్యత్ ఉండదని తెలుసుకున్న వంశీ, వైసిపి లోకి అడుగుపెట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఇందుకు గాను విజయవాడలోని వంగవీటిరాధా, కొడాలినాని సపోర్టు కూడా ఉంది. ఇదే జరిగితే తెలుగుదేశం ఆవిర్భావానికి నాంది పలికి, రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన ఎన్‌టీఆర్ సొంత జిల్లాలో తెలుగుదేశం కనుమరుగవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.