ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ఎప్పుడూ లేదు.. ఉండదూ! మోడీ విధానాలపై కేసీఆర్ నిప్పులు..
posted on Nov 29, 2021 7:02PM
యాసంగిలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నోరు తెరిస్తే కేంద్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందన్నారు. ఇంత దిగజారిన, నీచమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని.. భవిష్యత్తులో చూస్తామని కూడా అనుకోవడం లేదన్నారు కేసీఆర్.
కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ కోసం ఆహార సేకరణ చేస్తే.. రాష్ట్రాలు తమ బాధ్యతగా ధాన్యాన్ని సేకరించి వాటికి అప్పగిస్తాయన్నారు కేసీఆర్. ఇది జనరల్‌గా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా జరిగే తంతు అన్నారు. మన దేశంలో తినేది ఎక్కువగా అన్నం లేదంటే రొట్టె కాబట్టి ఎఫ్‌సీఐ వరి, గోధుమలనే సేకరిస్తుందని చెప్పారు. వీటిలో పెద్ద రాద్దాంతం సృష్టించి బీజేపీ సర్కార్ గందరగోళం చేస్తోందన్నారు. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కలిగి ఉండి.. 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఒక చిల్లర కొట్టు వ్యక్తిలా మాట్లాడకూడదని కేసీఆర్ అన్నారు. కిరాణ షాపు వాళ్లలా మాట్లాడకూడని చెప్పారు. ప్రతి విషయంలో లాభనష్టాలు బేరీజు వేసుకొని మాట్లాడితే ప్రభుత్వం ఎలా అవుతుందని కేసీఆర్ ప్రశ్నించారు.
దళిత బంధు అటకెక్కినట్టేనా ? కేబినెట్ సమావేశంలో చర్చే లేదా?
ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది దేశంలో సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉందన్నారు. దేశ ఆహార భద్రత కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. దాని నిర్వహణలో కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడో ఒకసారి నిల్వలు పెరిగితే దానికి ఆల్టర్నేట్ ఆలోచించే శక్తి కూడా కేంద్రానికే ఉంటుందని తెలిపారు. ఆ ప్రాసెస్‌లో 30 వేల కోట్లో.. 40 వేల కోట్లో.. 50 వేల కోట్లో.. పోనీ లక్ష కోట్లో నష్టం వస్తే కేంద్రం భరించాల్సి ఉంటుందన్నారు కేసీఆర్. ఆ బాధ్యత నుంచి మోడీ సర్కార్ తప్పుకుంటూ.. నెపాలను చాలా దిక్కుమాలిన తనంగా ఘోరంగా రాష్ట్రాల మీద నెట్టేటువంటి దరిద్రపు ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఇంత నీచమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదన్నారు కేసీఆర్. భవిష్యత్తులో చూస్తామని కూడా అనుకోవడం లేదన్నారు. ఇంత దిగజారిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అంటూ కేంద్ర ప్రభుత్వం విధానాలను సీఎం కేసీఆర్ ఎండగట్టారు.
దేశంలో ఆహార ధాన్యాలను సేకరించడం.. సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం.. అలాగే దేశ ఆహార భద్రత కోసం బఫర్ స్టాక్స్ నిలువ చేయడం.. ఈ బాధ్యత అనేక సంవత్సరాల నుంచి జరుగుతోందన్నారు కేసీఆర్. సేకరించిన ధాన్యంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆహార కొరత ఏర్పడకుండా.. ఆహార రక్షణ కోసం ఫుడ్ సెక్యూరిటీ కోసం బఫర్ స్టాక్స్‌ను మెయిన్‌టెన్ చేస్తాయి. ఆ తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆహార ధాన్యాలను అందించి నిరుపేదలకు అందించడం జరుగుతుందన్నారు. ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజ్యాంగ బద్ధంగా కేంద్రం మీద ఉన్న బాధ్యత అన్నారు కేసీఆర్. ఇది స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరుగుతోందన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయి రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారు కేసీఆర్. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని విమర్శించారు. గ్యాస్ ధరల పెంపు కావచ్చు.. పెట్రోల్ ధరల పెంపు కావచ్చు.. ఇట్లా అనేక రంగాల్లో కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసి ఆహార భద్రతను పరిరక్షిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను నడపాల్సిన కేంద్రం ఈరోజు దురదృష్టకరంగా తన సామాజిక బాధ్యతను విస్మరించి మేం కొనము.. కొనలేము అని చెబుతున్నారంటూ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.