బీజేపీ హంతక పార్టీ..కిషన్ రెడ్డి చేతకాని దద్దమ్మ!
posted on Nov 29, 2021 8:07PM
కేంద్ర ప్రభుత్వంలో మరోసారి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.గత రెండేళ్లలో దేశంలో భయంకరంగా పేదరికం పెరిగిందని చెప్పారు. కేంద్రం పవర్ రిఫామ్స్ పేరుతో రాష్ట్రం మెడమీద కత్తి పెడుతోందని తెలిపారు. ప్రతి బోర్ దగ్గర మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశించిందని పేర్కొన్నారు. కేంద్రం దుష్టా పాలనతో దేశంలో ఆకలి కేకలు పెరిగాయన్నారు. 750 మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.
యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం కేసీఆర్ తెలిపారు. బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని నమ్ముకుంటే సర్వనాశనం కావ్వాల్సిందేనన్నారు. మత చిచ్చు పెట్టి దేశ సమగ్రతను దెబ్బతీస్తారని చెప్పారు. దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడేళ్లలో బీజేపీ ఏ రంగానికి మేలు చేసిందో చెప్పాలన్నారు. రైతులు బాగుపడాలంటే బీజేపీ ప్రభుత్వం పోవాలని వ్యాఖ్యానించారు. కేంద్రానికి సామాజిక బాధ్యత ఉంటే ధాన్యం కొనాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
దళిత బంధు అటకెక్కినట్టేనా ? కేబినెట్ సమావేశంలో చర్చే లేదా?
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో బాయిల్డ్ రైస్ కొనించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. వరి విషయంలో కిషన్ రెడ్డి చేతకాని దద్దమ్మలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను 100శాతం ముంచుతుందని కేసీఆర్ ఆరోపించారు.