అందుకేనా.. కేసీఆర్ కు అనారోగ్యం..?
posted on Mar 11, 2022 2:54PM
తెలంగాణ సీఎం కేసీఆర్ కు శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేసీఆర్ ఎడమ చేయి, ఎడమ కాలిలో నొప్పి వచ్చింది. రెండు రోజులుగా ఆయన కొద్దిగా నీరసంగా కూడా ఉంటున్నారట. దీంతో కేసీఆర్ సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో కరోనరీ యాంజియోగ్రామ్, ఈసీజీ, టూడీ ఈకో, రక్తపరీక్షలు, ఎంఎంఆర్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కేసీఆర్ కు అన్నీ నార్మల్ అని రిపోర్టులు వచ్చాయని యశోద ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. కేసీఆర్ కు వయసు రీత్యా వచ్చిన కొన్ని ఇబ్బందులే అని, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఆయన తెలిపారు. అయితే.. కేసీఆర్ అకస్మాత్తుగా ఇలా అనారోగ్యానికి గురవడానికి కారణాలు ఏవి కావచ్చనే అంశంపై పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు.
గత కొద్ది నెలలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని టార్గెట్ గా చేసుకుని సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్సేత కొత్త ప్రత్యామ్నాయం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు జాతీయ స్థాయి నేతలతో తన అధికారిక నివాసం ప్రగతిభవన్ లో కూడా చర్చలు, సమాలోచనలు జరిపారు. దాంతో పాటుగా తమిళనాడు వెళ్లి ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ తో సంప్రదింపులు జరిపారు. మరో పక్కన ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కూడా మంత్రాంగం నడిపారు. ఈ మధ్యనే ఢిల్లీ వెళ్లి సీఎం కేజ్రీవాల్ తో కూడా సంప్రదింపులు జరపాలని యత్నించారు. అయితే.. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఉత్తి చేతులతో తిరిగి వచ్చారు. మరో పక్కన జేడీఎస్ సుప్రీం, మాజీ ప్రధాని దేవెగౌడతో కూడా ఫోన్ లో సంప్రదింపులు జరిపారు. ఇక ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కూడా బీజేపీకి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో జట్టుకట్టేందుకు యత్నించారు. అటు ఒడిశా సీఎంతో కూడా కేసీఆర్ టచ్ లోనే ఉన్నారు.
కానీ.. జాతీయ స్థాయిలో కేసీఆర్ తో చేతులు కలిపి సరికొత్త ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి కానీ, మమతా బెనర్జీ నుంచి కానీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నుంచి గానీ, దేవెగౌడ నుంచి కానీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే నుంచి గానీ చివరికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నుంచి కానీ సరైన స్పందన కేసీఆర్ కు దక్కలేదనే వార్తలు వస్తుండడం గమనార్హం. ఇటీవలే ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ వద్దకు వెళ్లి మంతనాలు జరిపారు. బీజేపీని, మోడీని విమర్శించే క్రమంలో కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలనే దాకా కేసీఆర్ వ్యవహారం వెళ్లింది. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏమీ చేయడం లేదని, నిధులు అందివ్వడం లేదని ఆరోపిస్తూనే.. అసలు తాము చెల్లించే నిధులతోనే కేంద్రం మనుగడ సాగిస్తోందనే దాకా ఆయన విమర్శల ఘాటు వెల్లువెత్తింది. తెలంగాణలో పండించే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడం లేదని ఆయన చాన్నాళ్లుగా ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు.
అక్కడితో ఆగని కేసీఆర్.. ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ లో ‘దేశ్ కీ నేత కేసీఆర్’ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.
మొత్తం మీద కేంద్రం పైనా, బీజేపీ పైనా, ప్రధాని మోడీ పైనా ఒంటికాలిపై లేచి మరీ విమర్శలు సంధించిన కేసీఆర్ కు ఇప్పుడు అకస్మాత్తుగా ఈ అనారోగ్యం రావడం వెనుక కారణాలు వెదికే పనిలో నెటిజన్లు పడ్డారు. గురువారం వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయాలు నమోదు చేసుకుంది. ఒక పక్కన మోడీనీ, బీజేపీనీ ఓడించాలని కేసీఆర్ కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతుంటే.. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని జనం బీజేపీకే పట్టం కట్టారు. మరీ ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో విజయంసాధించాలంటే దేశంలోని పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కూడా బీజేపీ ఘన విజయం సాధించడం కేసీఆర్ లో కాస్త కంగారు కలిగేలా చేసి ఉండొచ్చని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఉత్తర ప్రదేశ్ లో గెలిచిన పార్టీయే జాతీయ స్థాయిలో అధికారం చేపడుతుందనేది జగమెరిగిన సత్యం.
మరో పక్కన మోడీపై బహిరంగంగా విమర్శలు, ఆరోపణలతో చెలరేగిపోయిన కేసీఆర్ ను మోడీ- షా ద్వయం చూస్తూ ఊరుకోబోరనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్ల కూడా కేసీఆర్ కు అనారోగ్యం కలిగి ఉంటుందంటున్నారు. దాంతో పాటుగా గత కొద్ది రోజులుగా సీఎం కేసీఆర్ వివిధ రాష్ట్రాల పర్యటనలు, సమావేశాలు, సమీక్షలతో విశ్రాంతి లేకుండా ఉంటున్నారు. మరో పక్కన తెలంగాణలో కేసీఆర్ ప్రభ మసకబారుతోందనే విశ్లేషణలు కూడా వస్తుండడం విశేషం. ఎలాగైనా తెలంగాణలో పట్టు నిలుపుకోవాలని, జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనే ఆయన ఎత్తు గడలు సాగడం లేదనే అంచనాలు వస్తున్నాయి. దాంతో పాటు కేసీఆర్ వయస్సు కూడా మీద పడుతోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఇలా రెస్ట్ లెస్ గా మంత్రాంగాలు నడిపించడం వల్లే కూడా ఆయన అస్వస్థతకు గురై ఉండొచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రాజకీయంగా బద్ధ శత్రువైన టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ కేసీఆర్ కు అనారోగ్యం అనగానే ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. నిన్న మొన్నటి వరకూ కేసీఆర్ గుట్టంతా తమ వద్ద ఉందని, జైలుకు పంపిస్తామంటూ హెచ్చరికలు చేసిన సంజయ్ కేసీఆర్ ఆరోగ్యం పట్ల అమ్మవారిని ప్రార్థించడం గమనార్హం.