చంద్రబాబును ఆహ్వానిస్తా.. విమర్శించడం తగదు.. కేసీఆర్
posted on Nov 25, 2015 3:17PM
తెలంగాణ సీఎం కేసీఆర్ డిసెంబర్ నెల చివరి వారాంతంలో చండీయాగం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈకార్యక్రమానికి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పిలుస్తారా? లేదా అన్న పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు కేసీఆర్ ను ఆహ్వానించారు కాబట్టి కేసీఆర్ కూడా చంద్రబాబును ఆహ్వానిస్తారని కొందరు అనుకుంటుంటే.. అది వ్యక్తిగత హోమం కాబట్టి పిలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని మరికొందరూ అనుకున్నారు. అయితే ఈ సందేహాలన్నింటికి కేసీఆర్ బ్రేక్ వేశారు. తను డిసెంబర్ నెలలో నిర్వహించే చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానిస్తానని చెప్పారు. తన సొంత ఖర్చుతోనే యాగం నిర్వహిస్తున్నానని.. యాగం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందంటూ విమర్శలు చేయడం తగదని అన్నారు. మొత్తానికి ఇప్పటి వరకూ కేసీఆర్ చంద్రబాబును ఆహ్వానిస్తారా? లేదా? అంటూ చర్చించుకున్నారు.. ఇప్పుడు ఎలా పిలుస్తారు అనే దానిపై చర్చించుకుంటారేమో?