సిబీఐ పెండింగ్ కేసుల జాబితాలో జగన్ కేసు?
posted on Apr 6, 2012 7:32AM
సిబీఐ పెండింగ్ కేసుల జాబితాలో జగన్ కేసు?
ఆంధ్రా సిబీఐ కోర్టులో 20 ఏళ్ళుగా మూలుగుతున్న 415 కేసులు!
సిబీఐ కేసుల్లో పదిశాతం మందికే శిక్షలు!
జగన్ కు శిక్ష పడాలని ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న వారికీ ఇది నిజంగా నిరాశ కలిగించే వార్తే. సిబీఐ కేసులను దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన కోర్టుల్లో వందలాది కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిల్లో కొన్ని కేసులైతే 20 ఏళ్ళకు పైగా ఒకక్ అడుగు కూడా ముందుకు వేయలేక పోయాయి. వందలాది కేసులు ఇలా సిబీఐ కోర్టుల్లో మూలుగు తుంటే నేరస్థులు హాయిగా బైట తిరుగుతున్నారు. తెలుగువన్ డాట్ కామ్ పరిశోధనలో ఆంధ్రప్రదేశ్ లోని సిబీఐ కోర్టులో అవినీతి కేసులే 415 వరకూ పెండింగ్ లో ఉన్నాయని తేలింది.
వీటిలో కొన్ని పదేళ్ళ క్రితం నుంచి ఆ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. చాలా వరకూ అవినీతి కేసుల్లో సిబీఐ అరెస్ట్ చేసిన తర్వాత నిందుతులు బెయిల్ పై బైటకు వచ్చేస్తున్నారు. అయితే కేసులు మాత్రం సిబీఐ కోర్టులో అనేక సంవత్సరాల పాటు పెండింగ్ లో పడి ఉంటున్నాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సిబీఐ పెడుతున్న కేసుల్లో కేవలం 10 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయి. మిగిలిన కేసుల్లో సరైన సాక్ష్యాలు లేకనో, తప్పుడు కేసులు నమోదు చేయడం వల్లనో ఇతర కారణాల వల్లనో నిందితులు నిర్దోషులుగా బైట పడుతున్నారు. అవినీతి నిరోధక చట్టం క్రింద సిబీఐ నమోదు చేసిన కేసుల్లో దేశవ్యాప్తంగా సుమారు 8500 కేసులు వివిధ రాష్ట్రాల్లోని సిబీఐ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో చాలా వరకూ 20 కంటే ఎక్కువ కాలం పెండింగ్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో సుమారు 20 ఏళ్ళనుంచి దాదాపు 2100 కేసులు సిబీఐ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి.
సిబీఐ కోర్టులకు తగినంత సిబ్బంది, వనరులు లేకపోవడం, సిబీఐ విచారణలు నత్తనడకన సాగడం, తగినన్ని సాక్ష్యాధారాలు సేకరించడంలో సిబీఐ విఫలం కావడం, వివిధ కేంద్రప్రభుత్వ శాఖల నుంచి సహకారం లభించకపోవడం వంటి కారణాల వల్ల వందలాది కేసులు పెండింగ్ లో పడుతున్నాయి. సిబీఐ కోర్టుల తీరుతెన్నులు చూస్తుంటే జగన్ అక్రమార్జనలపై జరుగుతున్న విచారణ కూడా అనేక సంవత్సరాల పాటు కొనసాగినా ఆశ్చర్యపోనక్కర లేదు.