బొత్స కిరణ్ లకు క్లాస్ పీకుడే?
posted on Apr 4, 2012 10:21AM
న్యూఢిల్లీ
: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ సారథి బొత్స సత్యనారాయణ బుధవారం ఢిల్లీకి బయల్దేరారు. హై కమాండ్ వద్ద వారు 'క్లాస్ పీకించుకునేందుకే' ఢిల్లీకి వెళ్ళినట్లు తెలుస్తోంది. అనూహ్యంగా... ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకూ అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. ఈ ముగ్గురితో అధిష్ఠానం పెద్దలు సమావేశంకానున్నారు. 18 అసెంబ్లీ, నెల్లూరు లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం, పీసీసీ సారథుల మధ్య విభేదాలు కొంప ముంచుతాయని అధిష్ఠానం ఆం దోళన చెందుతోంది. సత్వరం సయోధ్య కుదర్చకుంటే పార్టీ ఉనికికే ప్రమాదమని భావిస్తోంది.
కాగా, ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర నేతలందరితోనూ వారు కిరణ్, బొత్సల మధ్య దూరంగురించే వాకబు చేస్తున్నారు. "ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారా? రాష్ట్రంలో పరిస్థితులె లా ఉన్నాయి? ఉప ఎన్నికలు జరిగే స్థానాలన్నీ కాంగ్రెస్ పార్టీవే కదా! వాటిని కాపాడుకోకుంటే రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందులేమిటి?'' అంటూ ఆరా తీస్తున్నా రు. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకూ నేతలనుంచి సానుకూల సమాధానాలు రావడంలేదు. పార్టీ, ప్రభుత్వ నాయకత్వాన్ని మార్చడమే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో... ప్రస్తుతానికి హెచ్చరికలతో సరిపెట్టి ఉప ఎన్నికల వరకు వేచి ఉండడమా? లేక ఇప్పుడే కాయకల్ప చికిత్స చేయడమా? అన్న మీమాంసలో పడినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో సోనియాగాంధీ చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది. 'తక్షణ కర్తవ్యం'పై చర్చకే డీఎస్‌ను పిలిపించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
త్వరలో జరగనున్న 18 శాసనసభా స్థానాల ఉప ఎన్నికలపై చర్చించేందుకే ఢిల్లీ వెళ్తున్నట్లు బొత్స చెబుతున్నారు. ఇతర అంశాలేవీ ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం లేనేలేదని ఆయన కొట్టిపారేశారు. కానీ.. కాంగ్రెస్ వర్గాలు మాత్రం 'క్లాస్ పీకేందుకే పిలుపు' అని గట్టిగా చెబుతున్నాయి. అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్‌లో పార్టీ నేతలు 'అధిష్ఠానంతో జోడెద్దుల భేటీ'పైనే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి ఒకరు, పలువురు సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో... 18 స్థానాలకు ఉప ఎన్నికల తర్వాత పార్టీ మిగులుతుందో లేదో తెలియడం లేదనే స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది.