ప్రగతిభవన్‌లోకి కాంగ్రెస్ నేతలు.. ఈటల ఎఫెక్ట్ మామూలుగా లేదుగా..
posted on Jun 25, 2021 7:51PM
బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్‌ను కలిశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డిలు ముఖ్యమంత్రిని కలిశారు. గతంలో ఎన్నడూ లేనిది వీరంతా సీఎంను కలవడం ఆశ్చర్యకరంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం కేసీఆర్‌ను కలిసింది.. తెలుగు రాష్ట్రాల మధ్య తారాస్థాయికి చేరిన జల వివాదం గురించో, తెలంగాణ రాష్ట్రాన్ని వేధిస్తున్న మరేదైనా సమస్య గురించో కాదు.. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో మరియమ్మ మృతిపై సీఎంకు ఫిర్యాదు చేశారు. లాకప్‌డెత్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని.. బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇదీ విషయం.
పైపైన చూస్తే విషయం ఇంతే. మామూలుగానైతే వేరే ఏ రాష్ట్రంలోనైనా ఇది సాధారణ విషయమే. సీఎంను ప్రతిపక్ష సభ్యులు కలవడం.. ఫిర్యాదు చేయడం మామూలుగా జరిగేదే. కానీ, ఇది తెలంగాణ కాబట్టి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి.. ఇప్పుడీ అంశం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. గడిచిన ఏడేళ్లలో ముఖ్యమంత్రిని ప్రజలు కానీ, ప్రతిపక్ష నేతలు కానీ నేరుగా కలిసిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. కనీసం సచివాలయానికి కూడా రాని సీఎం బహుషా దేశంలోనే కేసీఆర్ ఒక్కరేనేమో. ప్రతిపక్ష నేతల వరకూ ఎందుకు..? కనీసం మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలను సైతం నేరుగా కలుసుకున్న సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి.
ఎప్పుడో కేబినెట్ భేటీలప్పుడు, పార్టీ సమావేశాలప్పుడు మాత్రమే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు కనిపిస్తారు. అప్పుడుకూడా వారితో మాట్లాడేదేమీ ఉండదు. ఆయన వస్తారు.. చెప్పాలనుకున్నది చెబుతారు.. వెళ్లిపోతారు.. అంతే. అక్కడ ఇంకే మాటామంతి ఉండదు. చర్చలు గట్రా జరిగే ఛాన్సే లేదు. కేసీఆర్ మాట మినహా మరోకరి గొంతు వినిపించదు అంటారు. ప్రగతి భవన్ గేట్లు తెరుచుకునేది సీఎం కేసీఆర్ తలుచుకున్న వారికి మాత్రమే. ఆయన ప్రగతి భవన్ వీడి బయటకు రారు. మరెవరినీ ప్రగతి భవన్‌లోనికి రానివ్వరు. మంత్రులు, సొంత పార్టీ నాయకులకే సీఎంను కలిసే అదృష్టం లేకపోతే.. ఇక ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, సామాన్యుల గురించి చెప్పేదేముంది. అలాంటిది.. ఇంత కాలానికి ప్రతిపక్ష నేతల బృందానికి ప్రగతి భవన్‌లోకి వెళ్లి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం రావడం ఆశ్చర్యకరం.. అంతకుమించి ఆసక్తికరం.
సీఎం కేసీఆర్‌లో సడెన్‌గా ఇంతటి మార్పు ఎలా వచ్చింది? ప్రగతిభవన్ గేట్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎలా తెరుచుకున్నాయి? అనే ప్రశ్నకు ఈటలనే సమాధానంగా కనిపిస్తున్నారు. ఈటల రాజేందర్ పార్టీని వీడుతూ ప్రధానంగా చేసిన ఆరోపణ ఒక్కటే. అది ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్ అని. ప్రగతి భవన్ గేట్లు ఎవరి కోసం తెరుచుకోవని.. కనీసం తనను కూడా పలుమార్లు లోనికి రాకుండా అడ్డుకున్నారని.. ప్రగతి భవన్‌లో అడుగుపెట్టనీయకుండా తనను దారుణంగా అవమానించారంటూ.. ఈటల రాజేందర్ ఆరోపణలన్నీ ప్రగతి భవన్ చుట్టూనే తిరిగాయి. ఈరోజు ఈటల చేసిన ఆరోపణలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయి. జనమంతా ఈజీగా నమ్మేశారు కూడా. ఎందుకంటే.. సచివాలయానికే రాని ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌లోకి ఎవరినీ రానీయరంటూ రాజేందర్ అంతటివాడే చెబితే నమ్మకుండా ఎలా ఉంటారు. కేసీఆర్ నియంత అంటూ.. ఎవరినీ తన దరిదాపుల్లోకి కూడా రానీయరంటూ జనాల్లో బాగా చర్చ నడిచింది. ఆ విషయం తెలిసే.. సీఎం కేసీఆర్‌లో మార్పు మొదలైందని అంటున్నారు. ఇప్పటికే ఈటల లేవనెత్తిన రేషన్ కార్డుల ఇష్యూని సాల్వ్ చేసేశారు కేసీఆర్. ఇప్పుడిక ప్రగతి భవన్ గేట్లను తెరిచే పని మొదలుపెట్టారని అంటున్నారు. ఈటల ఆరోపణలతో కేసీఆర్ ఇమేజ్ బాగా దెబ్బతినడంతో.. నష్టనివారణ చర్యల్లో భాగంగానే ముఖ్యమంత్రిలో ఈ మార్పు మొదలైందని చెబుతున్నారు. ఎందుకంటే, సొంత పార్టీ నేతలనే లోనికి రానీయని కేసీఆర్.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తన ఇంటి గడప దాటి లోనికి రానిచ్చారంటే ఆశ్చర్యమేకదా.. మార్పు మంచిదేగా...