నారావారిపల్లెలో చంద్ర‘క్రాంతి’.. జనంలో, జనంతో బాబు కుటుంబం వేడుకలు

రాష్ట్రంలో, ఆ మాటకొస్తే దేశంలో ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు చాలా మందే ఉన్నారు. వారిలో ఆంధ్రప్రదేశ్ చంద్ర‌బాబు అత్యంత ప్ర‌ముఖుడు. సంప్రదాయాలను ఆచరించడంలో, ప్రజలలో మమేకం కావడంలో, అందులో కుటుంబాన్ని భాగస్వామ్యం చేయడంలో ఆయన స్టైలే వేరు. ప్రతి సంక్రాంతి పండుగను స్వస్థలంలో ప్రజల మధ్య జరుపుకుంటారు. ఆయ‌న స్వ‌స్థలం నారావారిప‌ల్లె. ఈ ప‌ల్లె అదృష్టం ఎలాంటిదంటే ప్ర‌తి సంక్రాంతి స‌మ‌యంలో ఈ ప‌ల్లె పేరు మారు మోగుతుంది. అంతే కాదు.. నారావారి పల్లెలో జ‌రిపే సంక్రాంతి వేడుక‌ల్లో నారా, నంద‌మూరి కుటుంబసభ్యులందరూ క‌ల‌సి  పాల్గొంటారు. దీంతో ఈ ఊరు క‌ళ‌క‌ళ‌లాడిపోతుంది. ఊరు ఊరంతా  జాత‌రలాంటి వాతావ‌ర‌ణం ఏర్పడుతుంది. సంక్రాంతి సందర్భంగా   ఒకే సారి నారా వారి కుటుంబానికి చెందిన మూడు త‌రాల‌ వారిని చూసి నారావారి పల్లె పులకించి పోతుంది. ఔను నారాచంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు, వారి వారసుడు దేవాన్ష్ లు సంక్రాంతి సందర్భంగా నారావారి పల్లెలో  చేసే సందడే సందడి. గ్రామస్తులతో మమేకమై పండుగ జరుపుకుంటారు. దీంతో తాతా, తండ్రి, మనవడు ముగ్గురినీ ఒకే ఫ్రేమ్ లో ఒకే సారి కనిపించే అరుదైన, అపురూపమైన దృశ్యం నారావారి పల్లె వాసులకు దక్కుతుంది.  

ఇక ఈ ఏడాది నారావారి పల్లె సంక్రాంతి సంబరాల్లో  నారా దేవాంశ్ ఆట పాట‌ల‌తో దేవాన్ష్ తల్లిదండ్రులు, తాతా నానమ్మలు మురిసిపోయారు. వారి మురిపెం చూసి నారావారిపల్లె పులకరించిపోయింది. అదలా ఉంటే  వైయ‌స్ స్వ‌స్త‌లం  పులివెందుల‌, ఇక కేసీఆర్ స్వ‌స్థలం చింత‌ మ‌డ‌క ఇంకా ఎంద‌రో నాయ‌కుల స్వ‌స్థలాలు ఉన్నాయి. అయితే అక్కడెక్కడా కనిపించని సంక్రాంతి సందడి, శోభ  ఒక్క నారావారి ప‌ల్లెలో మాత్ర‌మే క‌నిపిస్తుంది. దీంతో ఈ ఊరి భాగ్య‌మే భాగ్యం క‌దా? అనిపిస్తుంది. ఈ ఏడాది నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలకు హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ రాలేదు కానీ,  కానీ ఆయ‌న స‌తీమ‌ణి, కుమార్తె తెజస్విని, అల్లుడు, ఎంపీ శ్రీభరత్ వచ్చారు.  

ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదేంటంటే.. నారావారి పల్లెలో చంద్రబాబు సకుటుంబ సపరివార సమేతంగా సంక్రాంతి పండుగ జరుపుకోవడం అధికారంలో ఉన్న‌పుడు మాత్ర‌మే కాదు, అధికారంలో లేనప్పుడు కూడా జరుపుకుంటారు. స్వగ్రామంలో ప్రజలలో మమేకమై పండుగ జరుపుకోవడం ఆయన ఎప్పటి నుంచో పాటిస్తున్న ఆచారం. ఆనవాయితీ.   

 జ‌ననీ జ‌న్మ‌భూమిశ్చ స్వ‌ర్గాద‌పీ గ‌రీయ‌సీ   అంటారు.  అలా సొంతూరికి ఇంత‌టి పేరు ప్ర‌ఖ్యాతులు తీసుకురావ‌డం కూడా ఒక ఘ‌న‌తే. అలాంటి ఘ‌న‌త సాధించిన చంద్ర‌బాబు  స్వ‌స్థ‌లం నారావారిప‌ల్లె అదృష్ట‌మే అదృష్టం క‌దా? అన్న మాట వినిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu