శ్రీవారి దర్శనం నిలిపివేతపై బాబు స్పందన

తిరుమల శ్రీవారి ఆలయంలో పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించే అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువును ఆగస్టు 11 నుంచి 16 వరకు నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా ఆగస్టు 9 నుంచి 17 వరకు భక్తులకు పూర్తిగా శ్రీవారి దర్శనం నిలిపివేయనున్నట్టు టీటీడీ పాలక మండలి ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ నిర్ణయం పట్ల భక్తుల నుండి వ్యతిరేకత రావడంతో పాటు, శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం వెనుక కుట్ర దాగివుందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి లాంటి వారు అనుమానం వ్యక్తం చేశారు.

 

 

ఓ వైపు వ్యతిరేకత, మరో వైపు విమర్శలు వస్తుండంతో టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై చంద్రబాబు స్పందించారు.. గతంలో మహాసంప్రోక్షణలో పాటించిన నిబంధనలను అనుసరించాలని, ఎంత మందికి దర్శనం వీలు అయితే అంత మందికి దర్శనం చేపించాలని సూచించారు.. ఆగమ శాస్త్ర పద్దతుల ప్రకారమే పూజాధికాలు నిర్వహించాలని, మహాసంప్రోక్షణ క్రతువుకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడరాదని  సూచించారు.. పరిమితి సంఖ్యలో భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేయాలని కోరారు.. అంతేకాదు, శ్రీవారి దర్శనానికి రోజుల తరబడి భక్తులు వేచి చూసేలా చేయొద్దని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగరాదని బాబు అధికారులను ఆదేశించారు.