ప్రత్యేక హోదా, ప్యాకేజీ కావాలని కోరనున్న చంద్రబాబు...
posted on May 14, 2016 10:01AM
ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అనే అంశం విభజన చట్టంలో లేదని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని.. అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఏంటని కూడా వ్యాఖ్యానించిన వాళ్లు ఉన్నారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా రావడం అనేది కలే అన్నట్టు అయిపోయింది పరిస్థితి.
అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం తమకు ప్రత్యేక హోదా..ప్రత్యేక ప్యాకేజీ రెండూ కావాలని ప్రధాని మోడీని కోరనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 17న మోడీతో భేటీకానున్న చంద్రబాబు అక్కడ ఏం మాట్లాడాలన్న విషయమై రెండు రోజుల పాటు వివిధ శాఖల మంత్రులు, అధికారులతో సమీక్షలు జరపనున్నారు. ప్రస్తుతం కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నేడు తిరిగి రానున్నారు. వచ్చిన వెంటనే.. ప్రత్యేక హోదా నేతలు చేసిన వ్యాఖ్యలపై.. తరువాత అనుచరించాల్సిన విషయాలపై చర్చించనున్నట్టు సమాచారం. అంతేకాదు రెవిన్యూ లోటు భర్తీ, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధుల అంశాన్ని కూడా ప్రధానికి నివేదించనున్నారు. గత రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి మిగతా రాష్ట్రాలతోపాటు వచ్చిన సాయం ఎంత? విభజన చట్టానికి లోబడి ఏపీకి ప్రత్యేకసాయం ఎంత? అన్నదానిపై కూడా నివేదికలు తయారు చేసి వాటిని కేంద్రానికి సమర్పించాలని చూస్తున్నారు. మరి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన కేంద్రం చంద్రబాబు నాయుడు విన్నపాలు వింటుందా.. చూద్దాం ఏం జరుగుతుందో...