ఒకేరోజు ఇద్దరు జర్నలిస్టుల హత్యలు..
posted on May 14, 2016 10:46AM
బీహార్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ సీనియర్ జర్నలిస్టును కాల్చి చంపేశారు. వివరాల ప్రకారం.. బీహార్, సివాన్ జిల్లాలో రాజ్ దేవ్ రంజన్ అనే సీనియర్ జర్నలిస్టు హిందీ దినపత్రిక హిందూస్థాన్ లో పనిచేసేవాడు. అయితే తన ద్విచక్రవాహనంపై వెళుతున్న అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. సమాచారం అందకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గత కొంత కాలంగా సివాన్ చిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న శక్తులపై రాజ్ దేవ్ రంజన్ తన వార్తా పత్రికలో వరుస కథనాలు రాస్తున్న నేపథ్యంలో ఈ హత్య జరిగుంటుందని పోలీసులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ఇలాంటి ఘటనే జార్ఖండ్ లోనూ చోటుచేసుకుంది. జార్ఖండ్ లోని ఛాత్రా జిల్లాలో నిన్న రాత్రి అఖిలేష్ ప్రతాప్(35) అనే జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఒక స్థానిక ఛానెల్ లో పనిచేస్తున్న అతనిపై గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబార్ దాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు.