వైకాపా కుట్రలను తిప్పికొట్టిన రైతులు
posted on May 27, 2015 4:48PM
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపైన నిప్పులు చెరిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే అక్రమమని అభివర్ణిస్తూ ఆ పార్టీ నాయకులు ఎర్రచందనం స్మగ్లర్లతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఈ వేదికపై నుంచి నేను అడుగుతున్నాను - మీకు ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలు లేకపోతే ఎందుకు ఖండించడంలేదు అని ఆయన ప్రశ్నించారు. మీరు లాలూచీపడ్డారు కాబట్టే ఎర్రచందనం స్మగ్లర్ల అరాచకాలను ఖండించడానికి ముందుకు రావడంలేదని ఆయన విమర్శించారు. ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో కూడా స్థానిక ప్రజలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని యత్నించిందని, కాని తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని విషయంలో చిత్తశుధ్ధితో ఉందని గ్రహించిన రైతాంగం 33 వేల ఎకరాలు భూ సమీకరణకు ప్రభుత్వానికి అందించి వైసీపీ కుట్రలను భగ్నం చేశారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రైతాంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన ఈ రైతులను ఎవ్వరినీ జీవితమంతా గుర్తుపెట్టుకుంటానని ఆయన చెప్పారు.