నేరాలు-ఘోరాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్
posted on Mar 22, 2019 11:41AM
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు టీడీపీ నేతలతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ నేతలు జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. నేరుగా ఏపీలో తనకు ఓట్లు రావనే కేసీఆర్ జగన్నాటకం ఆడుతున్నారని, జగన్ పార్టీ ద్వారా ఏపీపై పెత్తనం చేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌కు ఓటేస్తామా? ఏపీని తాకట్టు పెడతామా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. దాడులతో ప్రత్యర్ధులను బలహీనపరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో భయపెట్టే కుతంత్రాలు పన్నుతోందని మండిపడ్డారు. కుట్రలు-కుతంత్రాలు చేసే ఆ మూడు పార్టీలకు బుద్ధిచెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
రాబోయే 17రోజులు అత్యంత కీలకమని టీడీపీ నేతలతో చంద్రబాబు చెప్పారు. 25 ఎంపీ సీట్లు, 150కి పైగా అసెంబ్లీ సీట్లలో టీడీపీ గెలవాలన్నారు. వైసీపీ, బీజేపీ బరితెగింపు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఫ్రస్టేషన్‌తో బీజేపీ, ఫాక్ష్యన్ ధోరణితో వైసీపీ తప్పుమీద తప్పులు చేస్తున్నాయని విమర్శించారు. నేరాలు-ఘోరాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని, అభివృద్ధి-సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ అని చంద్రబాబు అభివర్ణించారు. నేరాల్లో తప్ప పాలనలో జగన్‌కు అనుభవం లేదని విమర్శించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాళ్ల అనుచరులపైనే ఆరోపణలు వచ్చాయని, సాక్ష్యాలను తారుమారు చేయడం నేరస్తులకే అలవాటని చంద్రబాబు విమర్శించారు. బాబాయ్‌ని చంపేస్తే, దాచిపెట్టే వ్యక్తిని, పార్టీని ఏమనాలని నిలదీశారు. హత్య విషయాన్ని దాచిపెట్టడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, దర్యాప్తును దారిమళ్లించడం ఇలా వైసీపీ నేతలు చేయని తప్పులేదని చంద్రబాబు మండిపడ్డారు.