మంచు మోహన్‌బాబు హౌస్ అరెస్ట్
posted on Mar 22, 2019 12:01PM
సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్‌బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఆలస్యం చేస్తోందని నిరసిస్తూ ఆయన ర్యాలీ నిర్వహించ తలపెట్టడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ర్యాలీకి అనుమతివ్వలేమని పోలీసులు స్పష్టంచేశారు.
శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించి రూ.9 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వం ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని మోహన్ బాబు ఆరోపించారు. ఇదే విషయం అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా చొరవ చూపలేదన్నారు. ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని నిరసిస్తూ ఆయన 10వేల మంది విద్యార్థులతో కళాశాల నుంచి తిరుపతి వరకు భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు.
మోహన్ బాబు భారీ నిరసనకు దిగనున్నారని సమాచారం రావడంతో తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా పోలీసులు విద్యానికేతన్‌కు చేరుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని మోహన్‌బాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆయన ఇంటిని చుట్టుముట్టి.. హౌస్ అరెస్ట్ చేసారు. దీంతో మోహన్‌బాబు.. ర్యాలీకి బదులుగా, తన విద్యాసంస్థ ఎదుటే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని వెంటనే బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలో మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ కూడా పాల్గొన్నారు.