తప్పులెన్నుట తరువాత.. ముందు నీ సంగతేంటి అంబటీ!

అతి తెలివి రాజకీయాలకు జగన్ నేతృత్వంలోని వైసీపీ పెట్టింది పేరు. సొంతంగా చెప్పుకోవడానికి ఏమీ లేని ఆ పార్టీ ప్రత్యర్థి పార్టీల కుటుంబాలలో విభేదాలు ఉన్నట్లుగా సృష్టించి రాజకీయ లబ్ధికి పాకులాడటం తెలిసిందే. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలోనూ అదే చేసింది. తన అరాచక, అధ్వాన పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ప్రత్యర్థి పార్టీల అగ్రనేతలు, వారి కుటుంబాలలోని మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులతో రెచ్చిపోయింది. అలాగే వారి కుటుంబాలలో విభేదాలున్నాయనీ, ఒకరంటే ఒకరికి పొసగదనీ ప్రచారం చేసింది.    ఇప్పుడు జగన్  సొంత తల్లి, చెల్లి వైసీపీ అధినేతపై నిప్పులు చెరుగుతుంటే కన్వీనియెంట్ గా మౌనం వహిస్తోంది. జగన్ కుటుంబంలో విభేదాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత కుటుంబ సభ్యులపైనే వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ అనుచిత, అసభ్య పోస్టులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. అయినా    జగన్ నైజం మారలేదు. వైసీపీకి తత్త్వం బోధపడడంలేదు. ఇప్పటికీ జగన్ సొంత కుటుంబ వ్యవహారాలను మరిచిపోయి..  పక్క వారి కుటుంబ వ్యవహారాలతో రాజకీయం చేసి ఏదో మేరకు రాజకీయంగా లబ్ధి పొందాలన్న తాపత్రయమే కనిపిస్తోంది. 
గతంలో తెలుగుదేశం పార్టీని ఇరుకునపెట్టడానికి, చంద్రబాబు, లోకేష్ లకు చెక్ చెప్పడానికి నారా కుటుంబంతో నందమూరి విబేధాలు అంటూ సమయం, సందర్భం లేకుండా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువచ్చిన వైసీపీ  ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు, లోకేష్ పై ఎంత బురద జల్లినా ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చేసినట్లుంది. దీంతో ఇప్పడు పవన్ కల్యాణ్ ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా  మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు అంటే కొత్త పల్లవి ఎత్తుకుంది.  అందుకే అల్లు అర్జున్ మీద లేని ప్రేమను కురిపిస్తూ, ఆయన సినిమా పుష్ప 2 ప్రచారాన్ని తలకెత్తుకుంది. అదే సమయంలో మెగా, పవన్ అభిమానులను రెచ్చగొట్టేందుకు నానా కష్టాలూ పడుతోంది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు  పుష్ప ప్రమోషన్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఎవరూ ఆపుతామని అనకపోయినా.. పుష్ప 2ను ఎవరూ ఆపలేరు, ఆ సినిమా సక్సెస్ ను అడ్డుకోలేరంటూ అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించేశారు. పుష్ప1 హాలీవుడ్ స్థాయిలో ఉందనీ, తనకు తెలిసి పుష్ప2 అంతకు మించి ఉందనీ చెబుతూ పనిలో పనిగా పవన్ కల్యాణ్ పై పరోక్ష విమర్శలు కురిపించారు.  అల్లు అర్జున్ ఎదుగుదల కొందరికి కడుపుమంటగా మారిందంటూ మెగా కుటుంబంపై పరోక్ష విమర్శలు ఆరోపణలు చేశారు. అలా చేయడం ద్వారా రాజకీయంగా వైసీపీకి లబ్ధి చేకూరుతుందని భ్రమ పడుతున్నారు.

అయితే ఇదే వైసీపీ గతంలో పుష్ప1 రిలీజ్ సమయంలో టికెట్ల ధరల విషయంలో బన్నీకి, ఆ చిత్ర నిర్మాతలకు చుక్కలు చూపించిన విషయాన్ని కన్వీనియెంట్ గా మరచిపోయారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగానే దేశ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన పుష్ప ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నామమాత్రపు కలెక్షన్లతో సరిపెట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. అసలీ వివాదానికి కారణమైన వైసీపీ నాయకుడు, ఇటీవలి ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా నంద్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన శిల్పా రవిచంద్ర. ఆయన మౌనం వహించినా అంబటి రాంబాబు మాత్రం అల్లు అర్జున్ ఏదో వైసీపీ సభ్యుడు అన్నట్లుగా పెద్ద పెద్ద కబుర్లు చెబుతున్నారు.

ఇన్ని పెచ్చు మాటలు మాట్లాడే అంబటి రాంబాబు తమ పార్టీ అధినేత జగన్ కు  తల్లి చెల్లితో ఉన్న విభేదాలు, ఆస్తి తగాదాలు, పరస్పర విమర్శలతో వారు చేస్తున్న రచ్చ గురించి ఎందుకు మాట్లాడరు అని నెటిజన్లు నిలదీస్తున్నారు. జగన్ దాకా ఎందుకు సొంత అల్లుడు తనపై చేసిన విమర్శలపై అంబటి రాంబాబు ఎందుకు నోరెత్తరని ప్రశ్నిస్తున్నారు. తన కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దు అంటున్న అంబటి ఇప్పుడు బన్నీని అడ్డం పెట్టకుని పవన్ కల్యాణ్ టార్గెట్ గా విమర్శలు గుప్పించడాన్ని తప్పుపడుతున్నారు.