హైదరాబాద్ లో ఆస్తులుంటే బెదిరింపులు
posted on Mar 22, 2019 11:02AM
ఎన్నికల వేళ కొందరు టీడీపీ నేతలు పార్టీని వీడి వైసీపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ లో ఆస్తులున్నవాళ్ళని బెదిరించి పార్టీలో చేర్పించుకుంటున్నారని టీడీపీ ఆరోపించింది. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేసారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది నేతలు జనసేన పార్టీలో చేరతామని వచ్చినవారు వైసీపీలోకి వెళ్లారని అన్నారు. ఎందుకని ఆరా తీస్తే హైదరాబాద్‌లో వారికి ఆస్తులున్నాయని.. వాటితో తమకు సమస్యలు ఉన్నాయని చెప్పారని తెలిపారు. ఇప్పుడు జరుగుతున్నది గమనిస్తే అంతా అర్థమవుతోందన్నారు. ఓట్లు వేసేముందు ప్రజలు అన్ని విషయాలు ఆలోచించాలని, ఎవరి హయాంలో మేలు జరిగిందో.. ఎవరి హయాంలో అవినీతి, ఘోరాలు జరిగాయో బేరీజు వేసుకొని ఓటు వేయాలని పవన్ సూచించారు.
జగన్ తన బాబాయ్ వివేకా హత్యను ఎందుకు దాచిపెట్టారని పవన్ ప్రశ్నించారు. ఇంట్లో మనిషిని హత్య చేస్తే ఎందుకు అంత గోప్యత పాటించారని నిలదీశారు. కోడికత్తి ఘటనపై హడావుడి చేసిన జగన్.. వివేకా హత్యపై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన అన్నారు. హత్యా రాజకీయాలు చేసేవారు అధికారంలోకి వస్తే.. రాష్ట్రం ఏమవుతుందోనని భయమేస్తోందని పవన్ అన్నారు. టీఆర్‌ఎస్, వైసీపీ రహస్య చర్చలు ప్రజలకు తెలిసిపోయాయని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, చంద్రబాబుకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఆయనకు గిఫ్ట్‌గా మారుతుందన్నారు. పదేళ్లు భావోద్వేగాలతోనే గడిచిపోయాయని.. ఇక చాలు ఆపండని అన్నారు. ఏపీలో జగన్‌తో కలిసి పోటీచేయాలని తెలంగాణ స్నేహితులు కొంతమంది చెప్పారన్నారు. అయితే జగన్‌పై తన అభిప్రాయాలు ఎలా మార్చుకుంటానని చెప్పానని పవన్ అన్నారు.