ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు బిజీ.. బిజీ!

విభజన హామీల్లో ప్రధాన అంశమైన రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు సమకూర్చడానికి, పోలవరం తొలిదశ పనులు పూర్తి చేయడానికి ఇప్పటికే కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి ఓకే చెప్పింది. డిసెంబరులో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో దీనికి శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్లతో భేటీ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ఎన్డీయే కూటమి ఎంపీలతో చెప్పారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో వున్న సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు వెంటనే ప్రధానిని కలిశారు. సుమారు గంటన్నరపాటు ఈ భేటీ సాగింది. ఈ సందర్భంగా అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్రం సాయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇటీవలి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్ర సాయం గురించి చంద్రబాబు చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన వికసిత భారత్- 2047 విజన్‌కి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ఆంధ్రా-2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని చంద్రబాబు ప్రధానితో చెప్పారు. స్వాతంత్ర్య శత వసంతోత్సవం నిర్వహించుకునే 2047 నాటికి ఏపీ ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి, తలసరి ఆదాయాన్ని 43 వేల డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు ప్రధానికి వివరించారు. ఈ లక్ష్య సాధన కోసం కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రధానికి  చంద్రబాబు వివరించారు. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను  ఆంధ్రప్రదేశ్లో మరింత మందికి విస్తరించేందుకు వీలుగా చేయూతనందించాలని విజ్ఞప్తి  చేశారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరించే విషయంలో ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు ఏపీ సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ప్రధానమంత్రితో సమావేశం విజయవంతమైందని ఆ తర్వాత చంద్రబాబు 'ఎక్స్'లో వెల్లడించారు. 'పోలవరం ప్రాజెక్టుపై సవరించిన అంచనాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసినందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపాను' అని పేర్కొన్నారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. రైల్వే మంత్రితో చంద్రబాబు రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో ఐటీ, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటు పైనా చర్చించారు జరిపారు. రైల్వే మౌలిక వసతుల విషయంలోనూ చంద్రబాబు అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించారు. "వాల్తేర్ డివిజన్ ను యథావిధిగా ఉంచుతూనే విభజన చట్టంలో చెప్పిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని చంద్రబాబు ఈ సందర్భంగా కోరారు. 

మంగళవారం కేంద్ర మంత్రులు అమిత్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరీలను చంద్రబాబు కలవనున్నారు. వరద సాయం, అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, రాష్ట్రంలో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు, బడ్జెట్లో ప్రకటించిన పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి గురించి చర్చించనున్నారు.