అవినీతిప‌రులు, నేర‌స్తుల‌కు చోటు.. టీటీడీ జంబో బోర్డుపై జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు లేఖ‌

శతాబ్దాల చరిత్ర కలిగిన టీటీడీకు ముందెన్నడూ లేని విధంగా 81మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయడంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు. వ్యాపార ధోరణి, రాజకీయల ప్రయోజనాలతో ఏకంగా 81 మందితో బోర్డు ఏర్పాటు చేశారని ఆరోపించారు. బోర్డులో అవినీతి పరులు, నేర చరిత్ర కలిగినవారు ఉన్నారన్నారు. తిరుమల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక చింతనకు, సనాతన హైందవ ధర్మానికి ప్రతీక అని.. అలాంటి పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరమన్నారు. వెంటనే సీఎం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, బోర్డు రద్దు చెయ్యాలంటూ జ‌గ‌న్‌కు లేఖ రాశారు చంద్రబాబు. 

కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠను దెబ్బతీస్తే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. టీటీడీకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. 

భక్తి భావం, సేవా స్ఫూర్తి కలిగిన వారితో ఏర్పాటవ్వాల్సిన టీటీడీ బోర్డులో పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరస్థులు, కళంకితులకు చోటు కల్పించారని.. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని లేఖలో చంద్రబాబు విమ‌ర్శించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఇంత మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయలేదన్నారు. రాజకీయ నిరుద్యోగులకు ధర్మకర్తల బోర్డును కేంద్రంగా మార్చారని దుయ్యబట్టారు. భక్తుల మనోభావాలకు భిన్నంగా ఏర్పాటు చేసిన జంబో బోర్డును తక్షణమే రద్దు చేయాలని.. టీటీడీ సంప్రదాయాలను పాటిస్తూ నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.