చంద్ర‌బాబు ఇంటిపై వైసీపీ దాడి.. ఉండ‌వ‌ల్లిలో హైటెన్ష‌న్‌..

అమ‌రావ‌తిలో మ‌ళ్లీ పొలిటిక‌ల్ హీట్ పెరిగింది. ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు ఇంటి ద‌గ్గ‌ర తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది. చంద్ర‌బాబు ఇంటిని ముట్ట‌డించ‌డానికి వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేశ్ త‌న అనుచ‌రుల‌తో వ‌చ్చారు. జోగి ర‌మేశ్‌ను టీడీపీ నేత బుద్దా వెంక‌న్న వ‌ర్గం అడ్డుకుంది. ఈ సంద‌ర్భంగా బుద్దా వెంక‌న్న‌, జోగి రమేశ్‌ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ఇరుపార్టీల కార్య‌క‌ర్త‌లు ప‌ర‌స్ప‌రం తోసుకున్నారు. జెండా క‌ర్ర‌ల‌తో కొట్టుకున్నారు. చాలా సేప‌టి వ‌ర‌కూ ఈ తోపులాట‌, కొట్లాట కొన‌సాగింది. ఆల‌స్యంగా వ‌చ్చిన పోలీసులు ఇరుప‌క్షాల‌ను అడ్డుకున్నారు.

అస‌లు ఈ గొడ‌వ‌కు బీజం ఉత్త‌రాంధ్ర‌లో ప‌డింది. టీడీపీ సీనియ‌ర్ నేత‌ అయ్య‌న్న‌పాత్రుడు సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వం మ‌ట‌న్‌, షిఫ్ అమ్ముకోవ‌డ‌మేంట‌ని ఘాటు ప‌ద‌జాలంతో విమ‌ర్శించారు. మాట్లాడే హ‌క్కు త‌మ‌కుంద‌ని.. ఏం చేస్తారో చేసుకోమంటూ బూతులు మాట్లాడారు టీడీపీ నేత అయ్య‌న్న‌పాత్రుడు.

అయితే, అయ్య‌న్న‌పాత్రుడు వ్యాఖ్య‌ల‌పై వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేశ్ మండిప‌డ్డారు. సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తే ఊరుకునేది లేద‌ని.. చంద్ర‌బాబును, లోకేశ్‌ను అడ్డుకుంటామ‌ని.. ఏపీలో తిర‌గ‌నీయ‌కుండా చేస్తామంటూ జోగి ర‌మేశ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా అయ్య‌న్న‌పాత్రుడు వ‌ర్సెస్ జోగి ర‌మేశ్ ఎపిసోడ్ గురువారం జ‌రిగింది. క‌ట్ చేస్తే.. ఆ వివాదం శుక్ర‌వారం ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు ఇంటి ముంద‌ర‌కు షిఫ్ట్ అయింది. 

చంద్ర‌బాబు ఇంటిని చుట్టుముట్ట‌డానికి జోగి రమేశ్ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి ఉండ‌వ‌ల్లి వ‌చ్చారు. అయితే, జోగి రమేశ్ బ్యాచ్‌ను టీడీపీ నేత బుద్దా వెంక‌న్న త‌న వ‌ర్గీయుల‌తో క‌లిసి అడ్డుకోవ‌డంతో గొడ‌వ ముదిరింది. ప‌ర‌స్ప‌రం  తోసుకోవ‌డం, కొట్టాడుకోవ‌డం వ‌రకూ వివాదం ముదిరింది. దీంతో ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు ఉఇంటి ముందు హైటెన్ష‌న్ నెల‌కొంది.