పిల్లల ఖాతాల్లోకి కోట్లు.. ఏమిటీ మిస్టరీ ?

మనం యమ అర్జెంటుగా బీహార్ వెళ్లిపోవాలి.. అక్కడ అంతే అర్జెంటుగా ఏదో ఒక బ్యాంక్’లో ఒక ఎకౌంటు ఓపెన్ చేసేయాలి..ఎందుకేమిటి .. మన అదృష్టం బాగుంటే .. మనకు తెలియకుండానే మన బ్యాంక్ ఖాతాలో ఒకటో రెండో కాదు ఏకంగా వందా రెండొందల కోట్ల రూపాయలు జమై పోయినా  పోవచ్చును. మనమూ కోటీశ్వరులు అయిపోవచ్చును.  

ఇక విషయంలోకి వస్తే, కొద్దిరోజుల క్రితం, బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ఒక రైతు ఎకౌంటులో ఐదున్నర  లక్షల రూపాయలు జమయ్యాయి. ఆ రైతు కూడా అంత ఆడబ్బు ఎక్కడి నుంచి వచ్చింది,, ఎవరు,  ఎందుకు అంత పెద్ద మొత్తం తమ ఖాతాలో జమ చేశారు, అనేది పట్టించుకోకుండా ఇంచక్కా, ఖర్చు చేసుకున్నారు. అదెప్పుడో మార్చి నెలలో జరిగితే, తప్పు చేసిన బ్యాంక్ అధికారాలు ఇన్ని నెలల తర్వాత తీరిగ్గా, సెప్టెంబర్ 11న,  తప్పు తెలుసుకుని, సదరు రైతు వద్దకు వచ్చి,  తప్పయి  పోయింది మా డబ్బులు మాకిచ్చేయమని వేడుకున్నారు. అయితే అప్పటికే డబ్బులు ఖర్చు చేసిన  సదరు రైతు, చాలా కూల్’ గా ఇంకెక్కడి డబ్బులు, ఎప్పుడో ఖర్చాయి పోయాయి, అయినా అవి మీ డబ్బులు ఏమిటి, ప్రధాని మోడీ ఆ ఖాతాలో వేశారు’ అంటూ బ్యాంక్ అధికారుల మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానం ఇచ్చారు. 

ఈ సంఘటన వెలుగు చూసి ఇంకా వారం అయినా కాలేదు, ఇంతలోనే అదే బీహార్’ ఇద్దరు విద్యార్ధుల బ్యాంకు అకౌంట్స్’లో  లక్షలు కాదు ఏకంగా కోట్లే వచ్చి జమై పోయాయి. కటిహార్‌ జిల్లా బగౌరా పంచాయతీ పరిధిలోని పస్తియా గ్రామానికి చెందిన విద్యార్థులు.. గురుచంద్ర విశ్వాస్‌, అసిత్‌ కుమార్‌ల గ్రామీణ బ్యాంక్ ఖాతాల్లోకి రూ.960 కోట్లు జమయ్యాయి. ఈ  ఇద్దరు విద్యార్ధులకు  ఉత్తర్‌ బిహార్‌ గ్రామీణ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. పాఠశాల యూనిఫామ్’ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదు తమ ఖాతాలో జమ అయ్యిందో? లేదో? తెలుసుకునేందుకు సమీపంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు వెళ్లి ఖాతాలోని నిల్వ మొత్తం తనిఖీ చేయించారు. అంతే, కళ్ళు తిరిగి పోయాయి, ఒకరి ఖాతాలో రూ.60 కోట్లు, ఇంకొకరి  ఖాతాలో రూ.900 కోట్లు జమయ్యాయి. అయితే, బ్యాంక్ అధికారులు  తప్పును గుర్తించి, ఆ ఇద్దరి ఖాతాలను నిలిపివేసి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.అయితే, రోజుల వ్యవధి వరసగా ఒకే  తరహ తప్పులు దొర్లడంతోబ్యాంక్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏమో ..  ఏ పుట్టలో ఏ పాముందో .. ఏ తీగ లాగితే ఏ డొంకకదులుతుందో... చూడాలి.