చంద్రబాబు సవాల్ కు ఓకే చెప్పిన సీఎం

తిరుపతి: అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్‌ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వీకరించారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. తన సర్కారును చిక్కుల్లోకి నెట్టేందుకు చేసే ఎలాంటి కుట్రలు కుతంత్రాలైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్‌ వెంట వెళుతున్నవారిపై వేటు గురించి అడగ్గా..'అవసరమైనప్పుడు చర్యలు తీసుకుంటాం' అని బదులిచ్చారు. కలికిరి సిఎల్‌ఆర్‌సి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కేకేఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలేవీ ఆగవని కిరణ్‌ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంలో అవినీతిని అరికట్టడానికి ప్రత్యేక నేర నిరోధక చట్టాలు ప్రవేశ పెట్టామని గుర్తుచేశారు. మున్ముందు పాలనను మరింత సమర్థవంతంగా సాగించి వచ్చే 2014 ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించి తీరుతామన్నారు. ఈ విజయంపై ఎలాంటి అనుమానాలు వద్దని ఆయన జోస్యం చెప్పారు. రాబోయే రోజులలో పరిపాలనలో, ప్రభుత్వ కార్యక్రమాలలో మార్పులను ప్రజలే చూస్తారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీని సమిష్టిగా బలోపేతం చేస్తామన్నారు. నలుగురు ఎమ్మెల్యేలపై చర్యల విషయం స్పీకర్‌ పరిధిలో ఉన్నందున తానేమీ స్పందించలేనన్నారు. హంద్రీనీవా,గాలేరు-నగిరి కాలువలను పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనని కిరణ్‌ చెప్పారు. ఈ ఏడాది 32 శాతం దిగుబడి అదనంగా రావడంతో నిల్వ చేయడానికి అవసరమైన గోదాములు లేక సమస్య తలెత్తిందన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన తిరుపతిలో విలేకర్లతో మాట్లాడారు. శ్రీవారి దర్శనార్థం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. తిరుమలలో ముఖ్యమంత్రికి దేవస్థానం సాధికార మండలి ఛైర్మన్‌ జె.సత్యనారాయణ, ఈవో ఐవైఆర్‌ కృష్ణారావులు స్వాగతం పలికారు. తితిదే కార్యక్రమాలపై సీఎం అధికారులతో చర్చించారు. తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం రాత్రి తలనీలాలు సమర్పించుకున్నారు. మొక్కు చెల్లింపులో భాగంగా సీఎం బస చేసిన శ్రీపద్మావతి అతిథి గృహానికి క్షురకుని పిలిపించుకుని తలనీలాలు సమర్పించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu