ఆంధ్రాలో 4, తెలంగాణాలో 5స్మార్ట్ సిటీలు
posted on May 1, 2015 11:07AM
కేంద్రప్రభుత్వం ఆంద్రప్రదేశ్ లో విజయవాడ,గుంటూరు, కర్నూలు, చిత్తూరు నగరాలను, తెలంగాణాలో హైదరాబాద్, వరంగల్,కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ పట్టణాలను కూడా స్మార్ట్స్ సిటీలగా అభివృద్ధి చేయబోతున్నట్లు నిన్న ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరాలు మూడు కూడా రాజధాని పరిధిలోనే ఉన్నాయి గనుక అవి సహజంగానే స్మార్ట్ సిటీలుగా రూపాంతరం చెందవచ్చును. కనుక మిగిలిన నగరాలతో పోలిస్తే వాటిని స్మార్ట్ సిటీలుగా మార్చడానికి కేంద్రప్రభుత్వం అదనంగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. కానీ మిగిలిన నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు చాలా భారీ పెట్టుబడులు అవసరం ఉంటాయి.
ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలతో కలిపి 100స్మార్ట్ సిటీల అభివృద్ధికి, ఇంకా అనేక భారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదే విధంగా ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, రెండు మెట్రో రైల్ ప్రాజెక్టులు, అనేక ఉన్నత విద్యా వైద్య సంస్థల ఏర్పాటు వంటి భారీ వ్యయమయ్యే అనేక కార్యక్రమాలను కూడా తలకెత్తుకొంది. కనుక ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలోగా ఎన్ని నిధులు విడుదల చేస్తుందో తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
విశాఖ నగరాన్ని కూడా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని, అందుకు అమెరికా దేశ సాంకేతిక సహకారం తీసుకొంటామని ప్రధాని నరేంద్ర మోడీ ఇదివరకు ప్రకటించారు. అంటే విశాఖనగరంతో బాటు రాష్ట్రంలో మరో నాలుగు నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నట్లవుతుంది. అంటే రెండు రాష్ట్రాలలో తలో ఐదు నగరాలను స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయబోతున్నారన్నమాట.